సంగక్కరను కాపీ కొట్టిన స్మృతి మందాన: కోపడ్డ చిన్ననాటి కోచ్
హైదరాబాద్: ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతోన్న మహిళల వరల్డ్ కప్ పోటీల్లో భారత ఓపెనర్ స్మృతి మందాన అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఇప్పటివరకు భారత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 90, 106, 2 పరుగులు చేసింది. స్మృతి మందాన బ్యాటింగ్ శైలిని చూసి పలువురు క్రికెటర్లు ఆమె 'ఆడ గంగూలీ'గా అభివర్ణిస్తున్నారు.
టోర్నీలో భాగంగా వెస్టిండిస్‌తో జరిగిన రెండో వన్డేలో స్మృతి మందాన సెంచరీ సాధించడంపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం ప్రశంసల్లో ముంచెత్తారు. ఈ సందర్భంగా స్మృతి చిన్ననాటి కోచ్ అనంత్ తంబ్వేకర్ ఆమె గురించి కొన్ని విషయాలను క్రికెట్ అభిమానులతో పంచుకున్నారు.
స్మృతికి చిన్నప్పుడే క్రికెట్ మీద ఇష్టం ఏర్పడిందంట. అదెలాగంటే స్మృతి సోదరుడు శ్రవణ్ మందాన మహారాష్ట్ర అండర్-19 క్రికెట్ జట్టులో సభ్యుడు. ఒకసారి శ్రవణ్ పేరు పేపర్లో వచ్చింది. ఈ క్రమంలో స్మృతి తన తల్లితో 'అన్నయ్యలాగా క్రికెట్ ఆడతా. నా పేరు అలా పేపర్లో చూసుకోవాలి' అని అడిగిందట.

స్మృతి చిన్నప్పటినుంచి చాలా హుషారుగా ఉండేది
దీనికి ఆమె తల్లిదండ్రులు అంగీకరించడంతో తన సోదరులతో కలిసి ఆమె కూడా సంగ్లీలోని తన వద్ద శిక్షణ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. స్మృతి చిన్నప్పటినుంచి చాలా హుషారుగా ఉండేదని, అదేసమయంలో నెట్స్‌లో మాత్రం చాలా క్రమశిక్షణతో మెలిగేదని చెప్పారు. ఒక షాట్ ఆడటంలో కచ్చితత్వం సాధించేవరకు ఆమె నెట్స్‌ను వదిలిపెట్టేది కాదని తెలిపారు.

సంగక్కరను కాపీ కొట్టడానికి ప్రయత్నించేది
'నెట్స్‌లో తాను ఎప్పుడూ శ్రీలంక బ్యాట్స్‌మన్ సంగక్కరను కాపీ కొట్టడానికి ప్రయత్నించేది. దీంతో కొన్నిసార్లు నేను ఆమెను తిట్టేవాడిని. అలా కాపీ కొట్టడం సరికాదని చెప్పేవాడిని' అని అనంత్ తెలిపారు. స్మృతి 11 ఏళ్ల వయసులోని మహారాష్ట్ర అండర్-19 జట్టులో స్థానం దక్కించుకుందని అనంత్ వివరించారు.

ఏ మ్యాచ్ ఆడినా నాకు ఫోన్ చేయడం మరిచిపోదు
గత కొన్నేళ్లుగా స్మృతి జట్టులో కీలకంగా మారింది. స్మృతి ఎక్కడ ఏ మ్యాచ్ ఆడినా నాకు ఫోన్ చేయడం మరిచిపోదు. ప్రపంచకప్‌కి ముందు సన్నాహక మ్యాచ్‌లో సెంచరీ సాధించిన తర్వాత లండన్ నుంచి నాకు ఫోన్ చేసింది. ఏవైనా తప్పులు దొర్లాయా? సరిదిద్దుకోవల్సింది ఏదైనా ఉందా? అని అడిగిందని అనంత్ తెలిపారు.

నెట్ సెషన్‌కి డుమ్మా కొట్టేది కాదు
విదేశాల్లో, స్వదేశంలో ఎక్కడైనా సరే మ్యాచ్ అనంతరం క్రమం తప్పకుండా ఫోన్ చేస్తూనే ఉంటోంది. సలహాలు తీసుకుంటూనే ఉంటోందని అనంత్ చెప్పారు. స్మృతి చిన్నప్పటి నుంచి చాలా కష్టపడేతత్వం కలది. ఏనాడూ నెట్ సెషన్‌కి డుమ్మా కొట్టేది కాదని స్మృతి చిన్ననాటి కోచ్ అనంత్ తంబ్వేకర్ తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications