మొహాలీ: భారత్ - ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ సందర్భంగా యువరాజ్ సింగ్ గాయపడ్డాడు. పరుగు తీస్తున్న సమయంలో కాలు మడత పడింది. అయినప్పటికీ బ్యాటింగ్ చేస్తూ, పరుగులు తీశాడు. అయితే సింగిల్స్, డబుల్స్ తీసేందుకు యువీ ఇబ్బంది పడ్డాడు.
కాలు మడత పడటంతో రెండు మూడు పరుగులు తీయలేకపోయాడు. కోహ్లీ మరో పరుగు కోసం ప్రయత్నించి, రమ్మని చెప్పినప్పుడు యువీ రాలేకపోయాడు. దీంతో కోహ్లీ కూడా ఊరుకున్నాడు. అయితే, యువరాజ్ మాత్రం పాత యువీని గుర్తు చేశాడు.
ఫోటో గ్యాలరి: వరల్డ్ T20
ఆసిస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్ రౌండర్ పాత్ర పోషించాడు. కంగారూలు లెఫ్టార్మ్ స్పిన్నర్ జడేజా బౌలింగ్‌లో తడబడడం చూసిన ధోని.. వెంటనే యువరాజ్‌కు బంతిని అప్పగించాడు. అప్పుడు ఆసీస్ స్కోరు తొమ్మిది ఓవర్లలో 74/2.
ఈ టోర్నీలో తొలిసారి బంతి అందుకున్న యువరాజ్ తొలి బంతికే ప్రమాదకర స్టీవెన్ స్మిత్ (2) వికెట్ తీశాడు. ఆ తర్వాత మరో రెండు ఓవర్లలోనూ బ్యాట్స్‌మెన్‌ను కట్టిపడేసిన అతడు పొదుపుగా (1/19) బౌలింగ్ చేశాడు. ఆస్ట్రేలియా తక్కువ స్కోరుకే పరిమితమవడంలో తనవంతు పాత్రను యువీ పోషించాడు.

బ్యాటింగ్‌లో 7.4 ఓవర్లలో భారత్ 49/3తో కష్టాల్లో ఉన్న దశలో క్రీజులోకి వచ్చిన యువీ (18 బంతుల్లో 21) మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఒకవైపు గాయం వేధిస్తున్నా, అతడు ఎంతో పట్టుదలగా పరుగులు సాధించాడు. కోహ్లితో కలిసి నాలుగో వికెట్‌కు 6.2 ఓవర్లలో 45 పరుగులు జోడించాడు యువరాజ్.
కాలు మడత పడటంతో రెండుసార్లు ఫిజియో వచ్చి సపరిచర్యలు చేశాడు. వికెట్ల మధ్య పరుగెత్తేందుకు ఇబ్బంది పడినప్పటికీ... యువీ తన ఆట తీరుతో కొంత ఆకట్టుకున్నాడనే చెప్పవచ్చు. అయితే, విరాట్ కోహ్లీతో సమానంగా వికెట్ల మధ్య పరుగెత్తలేకపోయాడు. ఈ కారణంగా భారత్ రెండు మూడు పరుగులు కోల్పోయింది.
అయితే, కీలక సమయంలో మాత్రం, గాయం బాధించినా అతను ఆడిన తీరు చాలామందికి ముచ్చటగొలిపింది. ఓ సమయంలో కోహ్లీ.. మరో పరుగు కోసం రమ్మని పిలిచినా, యువరాజ్ నో చెప్పాడు.
యువరాజ్ రెండు బంతుల్లో 5 పరుగులు చేసిన సమయంలో గాయపడ్డాడు. ఆ తర్వాత కుంటుకుంటూనే పరుగెత్తుతూ... 18 బంతుల్లో 21 పరుగులు చేశాడు. భారీ షాట్ కొట్టబోయి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అయితే, అతను అలాగే ఔట్ కాకుండా గాయంతో ఆడి ఉంటే మ్యాచ్ ఏమయ్యేదనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. యువరాజ్ అలాగే మరో ఒకటి లేదా రెండు ఓవర్లు అవుట్ కాకుండా ఆడి ఉంటే మ్యాచ్ చేజారిపోయినా పోయేదంటున్నారు.