
2011 వరల్డ్ కప్ తర్వాత ఏం చేసింది?
వైట్ బాల్ క్రికెట్‌లో భారత జట్టు ఏం చేసిందని వాగన్ ప్రశ్నించాడు. 2011లో స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఈ ఫార్మాట్‌లో భారత్ ఏం చేసింది? అని అడిగాడు. ప్రపంచకప్‌లో ప్రపంచ నెంబర్ వన్ టీ20 జట్టుగా అడుగు పెట్టిన భారత్.. వైట్ బాల్ క్రికెట్‌లో అత్యంత పేలవంగా ఆడుతున్న జట్టు భారతేనని వాగన్ మండిపడ్డాడు. ఈ వన్డే ప్రపంచకప్ తర్వాత భారత జట్టు 2013 ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గింది. ఆ తర్వాత మరో ట్రోఫీని ముద్దాడలేకపోయింది. గత ఐదేళ్లలో అయితే కనీసం ఫైనల్స్ కూడా చేరలేకపోతోంది.

కాలం చెల్లిన ఆటతీరు..
భారత జట్టు ఇప్పటికీ కాలం చెల్లిన ఆటతీరుతోనే కొనసాగుతోందని వాగన్ చెప్పాడు. అసలు భారత జట్టు ప్రత్యర్థి బౌలర్లకు మొదటి ఐదు ఓవర్లలో ఊపిరి పీల్చుకునే అవకాశం ఎందుకు ఇస్తుంది? అని ప్రశ్నించాడు. అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నా కూడా టీ20 ఫార్మాట్‌లో ఆ జట్టు ఆటతీరు చూస్తే తనకు నోట మాట రావడం లేదన్నాడు. టీమిండియా వద్ద ఆటగాళ్లున్నా సరైన ప్రాసెస్ లేదని, దాన్ని సరి చేసుకుంటే భారత్ మళ్లీ విజయాల బాట పడుతుందని అభిప్రాయపడ్డాడు.

ఉద్యోగాలు పోతాయని భయం..
భారత జట్టును ఎవరూ విమర్శించరని, ఎందుకంటే అలా విమర్శిస్తే సోషల్ మీడియాలో తిట్టిపోస్తారని భయపడతారని వాగన్ చెప్పాడు. జట్టును విమర్శిస్తే ఉద్యోగాలు పోతాయని భారత్‌లోని క్రికెట్ పండితులు భయపడతారని, బీసీసీఐ చాలా బలమైంది కావడం వల్లనే వాళ్లు ఇలా ఆలోచిస్తున్నారని అన్నాడు. అయితే ప్రస్తుతం అలాంటి భయాలను పక్కనపెట్టి సూటిగా అభిప్రాయాలు చెప్పాల్సిన తరుణమని తెలిపాడు. తమ స్టార్ ఆటగాళ్ల వెనుక ఈ విశ్లేషకులు ఎక్కువకాలం దాక్కోలేరని, ఒక జట్టుగా ఆడే విషయంలో కఠిన నిర్ణయాలు తప్పవని తేల్చిచెప్పాడు. భారత్ వద్ద బౌలింగ్ ఆప్షన్స్ ఎక్కువ లేవని, అలాగే స్పిన్ ట్రిక్స్ కూడా కనిపించడం లేదని అన్నాడు.


Click it and Unblock the Notifications












