హైదరాబాద్: ఆస్ట్రేలియాతో వన్డే సిరిస్ గెలిచిన ఆనందంలో భారత జట్టు ఆటగాళ్లు తమ తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్‌కు అద్భుతమైన విందు ఇచ్చాడు.
వివరాల్లోకి వెళితే అనుపమ్ ఖేర్ తన తాజా సినిమా 'రాంచీ డైరీస్' ప్రచారం కోసం బుధవారం రాంచీకి వచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మహేంద్ర సింగ్ ధోనీ ఇంటికి వెళ్లాడు. ధోనీ, అతడి తండ్రి పాన్ సింగ్ దగ్గరుండి మరీ అతిథికి మర్యాదలు చేశారు.

ముగ్గురూ కలిసి డిన్నర్ చేసిన అనంతరం కొంత సేపు సరదాగా మాట్లాడుకున్నారు. కాగా, ధోనీ బయోపిక్‌లో తండ్రి పాత్రను అనుపమ్ ఖేర్ పోషించిన సంగతి తెలిసిందే. ఖేర్ సినిమా హిట్ అవ్వాలని ధోనీ ఈ సందర్భంగా ఆకాంక్షించాడు. అక్టోబర్ 13న రాంచీ డైరీస్ సినిమా విడుదల కానుంది.