హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో విభేదాల కారణంగా కోచ్ పదవికి కుంబ్లే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. విండిస్ పర్యటనకు కోచ్‌గా కుంబ్లేకి రెండు వారాల పాటు పొడిగింపు ఇచ్చినప్పటికీ, కోహ్లీ, ఆటగాళ్లతో సఖ్యత లేని కారణంగా తన పదవికి మంగళవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఇలా కుంబ్లేను అవమానకర రీతిలో సాగనంపడంపై సునీల్ గవాస్కర్ తీవ్రంగా మండిపడ్డాడు. అసలు భారత క్రికెటర్లకు ఎటువంటి కోచ్ కావాలంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. కోచ్‌ను కాదు.. అతన్ని వ్యతిరేకించే ప్లేయర్స్‌ను టీమ్ నుంచి సాగనంపాలని గవాస్కర్ స్పష్టంచేశాడు.

కోచ్ కఠినంగానే ఉండాలని, మెతగ్గా వ్యవహరిస్తే మెరుగైన ఫలితాలు రావని అన్నాడు. ఇక్కడ ఏ ఒక్కరినీ టార్గెట్ చేయకుండా భారత ఆటగాళ్ల తీరుని గవాస్కర్ తప్పుబట్టాడు. మీడియాలో వచ్చిన వార్తలు నిజమైతే.. కుంబ్లే విషయంలో ఆటగాళ్లు వ్యవహరించిన తీరు సరిగా లేదని సన్నీ అభిప్రాయపడ్డాడు.
'మన ఆటగాళ్లను చూస్తుంటే మెతకగా ఉండే కోచ్‌ను కోరుకుంటున్నట్లు అనిపిస్తోంది. ఇవాళ మీరు బాగా అలసిపోయారు కాబట్టి ప్రాక్టీస్ అవసరం లేదు. సెలవు తీసుకోండి లేదా షాపింగ్‌కు వెళ్లండి అని చెప్పే కోచ్ వారికి కావాలేమో. తీవ్రంగా సాధన చేయించి ఫలితాలు రాబట్టే కోచ్ వారికి అవసరం లేదు. నిజంగా కోచ్ గురించి ఏ ఆటగాళ్లయినా ఫిర్యాదు చేస్తే వారిని జట్టులోంచి తీసేయాలి' అని గవాస్కర్ మండిపడ్డాడు.
ప్రధాన కోచ్‌గా అనిల్ కుంబ్లే రాజీనామాను భారత క్రికెట్‌కు దుర్దినంగా గవాస్కర్ అభివర్ణించాడు. భారత క్రికెట్‌కు అనిల్ చేసిన సేవలను ప్రశంసించాడు. 'కమిటీ విశ్వాసం ఉంచినందున అనిల్ మరికొంత కాలం కొనసాగాల్సింది. అతడు ఆడే రోజుల్లో గాయానికి కట్టుకట్టుకొని బరిలోకి దిగిన ధీశాలి' అని అన్నాడు.
'ఆటగాడిగా కుంబ్లే ఎంతో సాధించాడు. కోచ్‌గానూ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అలాంటి వ్యక్తిపై దుష్ప్రచారం జరుగుతోంది. హెడ్ మాస్టర్లా వ్యవహరిస్తున్నాడన్న వార్తలు మీడియాలో వస్తున్నాయి. ఇది సరికాదు. కొత్తగా వచ్చే కోచ్‌కు ఇది చెడు సంకేతాలను పంపిస్తుంది. ఆటగాళ్లకు లొంగి ఉండు లేదా కుంబ్లేలా నిష్క్రమించు అన్న చెడు సందేశం వెళుతుంది' అని అన్నాడు.