హైదరాబాద్: టెస్టుల్లో వరుసగా నాలుగు డబుల్ సెంచరీలు సాధించిన కెప్టెన్ కోహ్లీపై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించాడు. ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో 240 బంతుల్లో 24 ఫోర్ల సాయంతో కోహ్లీ డబుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో డబుల్ సెంచరీ సాధించిన అనంతరం కెప్టెన్ కోహ్లీ తన బ్యాట్‌తో ప్రేక్షకులకు అభివాదం చేశాడు. ఈ సందర్భంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్... కోహ్లీ బ్యాట్‌పై ఓ స్పాట్‌ని పరిశీలనగా గమనించాడు. ఆ విషయాన్ని సచిన్ తన ట్విట్టర్‌లో తెలియజేశాడు.
సచిన్ ట్విట్టర్‌లో 'నువ్వు అద్భతమని నీ బ్యాట్‌పై ఉన్న స్వీట్ బ్యాట్ చెబుతోంది. స్కోరు బోర్డ్స్ అవసరం లేదు. దేవుడు ఎల్లప్పుడూ నీ బ్యాట్‌ని మాట్లాడేలా చేయాలి' అని ట్వీట్ చేశాడు.
కాగా, 28 ఏళ్ల విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో డబుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో కోహ్లీ వరుసగా నాలుగో డబుల్ సెంచరీని సాధించాడు. తద్వారా టెస్టు క్రికెట్ చరిత్రలో వరుసగా నాలుగు సిరీస్‌లలో నాలుగు డబుల్ సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
అంతక ముందు వెస్టిండిస్‌పై 200, న్యూజిలాండ్‌పై 211, ఇంగ్లాండ్‌పై 235 ఇలా వరుసగా మూడు డబుల్ సెంచరీలు చేశాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజాలు డాన్ బ్రాడ్‌మన్, రాహుల్ ద్రవిడ్‌ల రికార్డుని విరాట్ కోహ్లీ చెరిపేశాడు. డాన్ బ్రాడ్‌మన్, రాహుల్ ద్రవిడ్‌లు మాత్రమే వరుసగా మూడు సిరిస్‌లలో మూడు డబుల్ సెంచరీలను సాధించారు.
2011లో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీకి బంగ్లా టెస్టు 54వది కావడం విశేషం. టెస్టుల్లో కోహ్లీ ఇప్పటివరకు 16 సెంచరీలు, 14 అర్ధసెంచరీలు నమోదు చేశాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 204 పరుగులు చేసిన కోహ్లి...తైజుల్ ఇస్లామ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేరాడు.