
హైదరాబాద్: ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న తొలి టీ20లో వెస్టిండిస్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండిస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 95 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టీమిండియాకు 96 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
విండిస్ బ్యాట్స్‌మెన్లలో కిరన్ పొల్లార్డ్ 49 బంతుల్లో 49(2 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులతో రాణించగా... మిగిలిన వారు నిరాశపరిచారు. భారత్ బౌలర్లలో నవ్‌దీప్ సైనీ 3 వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్, కృనాల్ పాండ్యా, రవీంద్ర జడేజాలు తలో వికెట్ తీశారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
అంతకముందు టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని పలువురు యువ క్రికెటర్లకు ఈ సిరిస్‌లో సెలక్టర్లు చోటు కల్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొల టీ20లో బ్యాటింగ్‌లో మనీశ్ పాండే... బౌలింగ్‌లో నవదీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్‌లకు జట్టు మేనేజ్‌మెంట్ అవకాశమిచ్చింది.
అమెరికాలో క్రికెట్‌కి ఆదరణ పెంచేందుకు ఈ టీ20ని ఫ్లోరిడాలో నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు వెస్టిండిస్‌తో ఇక్కడ జరిగిన టీ20లో వెస్టిండీస్ ఏకంగా 245 పరుగుల భారీ స్కోరు సాధించింది. కేఎల్ రాహుల్ (110) మెరుపు సెంచరీ సాయంతో భారత్ లక్ష్యానికి చేరువగా వచ్చింది కానీ.. కేవలం ఒక్క పరుగు తేడాతో మ్యాచ్ ఓడిపోయింది.
వెస్టిండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. విండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా వెస్టిండిస్‌తో నెల రోజుల పాటు సుదీర్ఘ సిరిస్‌లో తలపడనుంది. ఈ పర్యటనలో భాగంగా శనివారం, ఆదివారం జరగనున్న మొదటి రెండు టీ20లు ఈ స్టేడియంలోనే జరగనున్నాయి.