ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. గబ్బా వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో ఎనిమిది పరుగుల తేడాతో గెలిచింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై వెస్టిండీస్‌కు ఇదే తొలి టెస్టు విజయం. మ్యాచ్ ఆద్యంతం హోరాహోరీగా సాగింది. టెస్టు క్రికెట్ ఖ్యాతిని పెంచేలా ఉత్కంఠగా సాగిన ఈ టెస్టులో అంతిమంగా విండీస్ పైచేయి సాధించింది. బొటనవేలు విరిగినా తిరిగి మైదానంలోకి అడుగుపెట్టిన షామర్ జోసెఫ్ అద్భుత ప్రదర్శన చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టి తమ జట్టుకు చరిత్రాత్మకంగా విజయాన్ని అందించాడు.
తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి వెస్టిండీస్ 64 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. కానీ
ఆ తర్వాత వెస్టిండీస్ బ్యాటర్లు గొప్ప పోరాటపటిమ చూపించి 311 పరుగులు చేశారు. జాషువా డిసిల్వా (79), కవెమ్ హోడ్జ్ (71), కెవిన్ సిన్‌క్లెయిర్ (50), అల్జారీ జోసెఫ్ (32) సత్తాచాటారు. అనంతరం ఆస్ట్రేలియా కూడా తక్కువస్కోరుకే అయిదు వికెట్లు కోల్పోయింది. 54/5తో కష్టాల్లో నిలిచిన ఆసీస్ ఉస్మాన్ ఖవాజా (75), అలెక్స్ కేరీ (65), ప్యాట్ కమిన్స్ (64*) ఆదుకున్నారు.

అయితే ఆసీస్ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. 289/9 స్కోరుకే తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 22 పరుగుల వెనుకంజలో ఉండి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం గమనార్హం. ఫ్లడ్ లైట్‌లో పింక్ బాల్ మరింత స్వింగ్ అవుతుందనే ఉద్దేశంతో కమిన్స్ ఇన్నింగ్స్‌ను ముందుగా డిక్లేర్ చేశాడు. వాళ్ల వ్యూహాలకు తగ్గట్టుగానే వెస్టిండీస్ 193 పరుగులకే ఆలౌటైంది. హేజిల్‌వుడ్, నాథన్ లయాన్ చెరో మూడు వికెట్లతో సత్తాచాటారు.
వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో మెకంజీ (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే ఆఖరి వికెట్‌గా షామర్ జోసెఫ్ (3) రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. స్టార్క్ వేసిన యార్కర్‌తో అతడి బొటనవేలుకి తీవ్రగాయమైంది. అనంతరం 216 పరుగుల లక్షఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 207 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (91) పోరాటం వృథాగా మారింది. అయితే ఆసీస్ 113/2తో ఓ దశలో మెరుగైన స్థితిలోనే నిలిచింది. కానీ షామర్ ధాటికి ఆస్ట్రేలియా కుప్పకూలింది. షామర్‌కు ఇదే అరంగేట్ర టెస్టు సిరీస్ కావడం విశేషం. మరోవైపు కామెంటరీ బాక్స్‌లో ఉన్న వెస్టిండీస్ దిగ్గజం లారా ఎమోషనల్ అయ్యాడు. విజయానంతరం భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు.