ట్రిండాడ్ వేదికగా జరిగిన రెండో టీ20లో సౌతాఫ్రికాపై వెస్టిండీస్ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. టెస్టు సిరీస్‌ను 0-1తో కోల్పోయిన విండీస్ పొట్టి ఫార్మాట్‌లో చెలరేగింది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్‌కు ఇది వరుసగా మూడో సిరీస్ విజయం.
రెండో టీ20లో వెస్టిండీస్ ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 179 పరుగులు చేసింది. షై హోప్ (41; 22 బంతుల్లో, 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రోవ్‌మన్ పావెల్ (35; 22 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లు), రూథర్ ఫోర్డ్ (29; 18 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తాచాటారు. సఫారీ బౌలర్లలో విలియమ్స్ మూడు, పాట్రిక్ రెండు వికెట్లు తీశారు.

వెస్టిండీస్‌కు శుభారంభం దక్కింది. షై హోప్, అథంజె (28; 21 బంతుల్లో) తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించారు. ఈ క్రమంలో పవర్‌ప్లేలో విండీస్ 43 పరుగులు చేసింది. అయితే సఫారీ బౌలర్లు పుంజుకుని క్రమంగా వికెట్లు తీశారు. కానీ ఆఖర్లో పావెల్, రూథర్‌ఫర్డ్ జట్టుకు మంచి స్కోరు అందించారు. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా 19.4 ఓవర్లలో 149 పరుగులకు ఆలౌటైంది.
రీజా హెండ్రిక్స్ (44; 18 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. ట్రిస్టన్ స్టబ్స్ (28; 24 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్), రికెల్టన్ (20; 13 బంతుల్లో, 2 సిక్సర్లు) పరుగులు చేశారు. షామర్ జోషెఫ్, షెఫార్డ్ చెరో మూడు, అకెల్ హోస్సేన్ రెండు వికెట్లు పడగొట్టారు. హెండ్రిక్స్ విధ్వంసంతో సౌతాఫ్రికా పవర్‌ప్లేలో ఏకంగా 71 పరుగులు చేసింది. కానీ అదే జోరును కొనసాగించలేకపోయింది. వికెట్లు చేజార్చుకుంటూ మ్యాచ్‌ను కోల్పోయింది.