లండన్: ప్రపంచకప్ టోర్నమెంట్‌ను సాధించిన ఘనత వెస్టిండీస్‌కు ఉంది. ఈ మెగా ఈవెంట్ ఆరంభంలోనే అదర గొట్టిన చరిత్ర విండీస్‌ది. వెస్టిండీస్‌తో మ్యాచ్ అంటే ప్రత్యర్థి జట్లు గెలుపుపై ఆశలు వదిలేసుకునేవి. గార్డన్ గ్రీనిడ్జ్, డెస్మండ్ హేన్స్, వివియన్ రిచర్డ్స్, గస్ లోగీ, ఆండీ రాబర్ట్స్, మాల్కమ్ మార్షల్, మైకెల్ హోల్డింగ్, కోర్టనీ వాల్ష్.. క్రికెట్ ప్రపంచాన్ని శాసించారు. సాధారణంగా పవర్ ప్లే అనే పదాన్ని టెన్నిస్‌లో ఎక్కువగా వింటూంటాం. క్రికెట్లో పవర్ ప్లేకు పెట్టింది పేరు వెస్టిండీస్ జట్టు. ప్రత్యర్థి జట్టు ఎంత బలంగా వ్యూహాలను రచించుకున్నా, తమ పవర్ ప్లేతో ఎదురుదాడికి దిగేది విండీస్ జట్టు.
చివరి పది మ్యాచుల్లో..
బంగ్లాదేశ్‌పై ఓటమితో వెస్టిండీస్ మరో అతి చెత్త రికార్డును నమోదు చేసుకుంది. బంగ్లాదేశ్ జట్టుతో ఆడిన చివరి పది మ్యాచుల్లో విండీస్ గెలిచింది రెండంటే రెండు మాత్రమే. ఎనిమిది మ్యాచుల్లో బంగ్లాదేశ్ టీమ్ ఈ కరేబియన్ల జట్టుపై పైచేయి సాధించింది. చివరి 10 మ్యాచుల్లో వరుసగా అయిదింటిని బంగ్లాదేశ్‌కు కోల్పోయింది విండీస్. ఆరో మ్యాచ్‌లో విజయం సాధించింది. అయినప్పటికీ- ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. అక్కడి నుంచి జైత్రయాత్ర ఆరంభించనూ లేదు. ఏడు, ఎనిమిది మ్యాచుల్లో బంగ్లా చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసింది. తొమ్మిదో మ్యాచ్‌లో విజయం సాధించింది. టాంటన్‌లో జరిగిన పదో మ్యాచ్‌లో మరీ చెత్తగా ఓడిపోయింది విండీస్.
నాసిరకం బౌలింగ్..
అలాంటి టీమ్ ప్రతిష్ఠ మసకబారింది. సాధారణ మ్యాచ్‌లు అనుకుంటే ఫర్వాలేదనుకోవచ్చు. ఏకంగా ప్రపంచకప్‌లో ఉనికి కోసం ప్రయత్నిస్తోంది. మనుగడ సాగించడానికే ఇబ్బందులను ఎదుర్కొంటోంది. చివరికి- బంగ్లాదేశ్ వంటి జట్టు వద్దా మోకరిల్లుతోంది. ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం ఇంగ్లండ్ టాంటన్‌లోని కూపర్స్ అసోసియేట్స్ కంట్రీ గ్రౌండ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ విజయం కోసం పడిన పాట్లను చూస్తోంటే అయ్యో అనిపించకమానదు. క్రిస్ గేల్ వంటి హార్డ్ హిట్టర్లు విఫలమైన పిచ్‌పై బంగ్లాదేశ్ చెలరేగిపోయి ఆడటం, 322 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 41 ఓవర్లలోనే ఛేదించి అవతల పడేయడం చూస్తే.. విండీస్ బౌలింగ్ ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.