హైదరాబాద్: 1980, 90 దశకాల్లో వెస్టిండీస్ జట్టు ప్రపంచ క్రికెట్‌ను శాసించినప్పటికీ కొన్ని సందర్భాల్లో క్రీడాస్ఫూర్తిని వదిలేసిందని ఆ జట్టు దిగ్గజ బ్యాట్స్‌మన్ బ్రియాన్ లారా అంగీకరించాడు. నెంబర్‌వన్‌గా ఉన్న జట్టు అందరికీ ఆదర్శంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంటుందని లారా పేర్కొన్నాడు.
లండన్‌లోని లార్డ్స్‌లో 'ఎంసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్' లెక్చర్ సందర్భంగా లారా పైవ్యాఖ్యలు చేశాడు. 1988లో లార్డ్స్ వేదిగా ఇంగ్లండ్‌ను ఓడించేందుకు వెస్టిండిస్‌కు అంపైర్ పొరపాట్లే సహకరించాయని ఈ సందర్భంగా లారా గుర్తు చేశాడు.
'నేను ప్రపంచ క్రికెట్‌లో వెస్టిండీస్ ఆధిపత్యాన్ని చూస్తూ పెరిగాను. 1980 నుంచి 15 ఏళ్ల పాటు వెస్టిండిస్ జట్టు టెస్టు సిరిస్‌లో ఓటమి అన్నదే ఎరుగదు. అయితే ఇక్కడ మా ఫాస్ట్‌బౌలర్ కొలిన్ క్రాఫ్ట్.. ఓ మ్యాచ్‌లో అంపైర్ ఫ్రెడ్ గూడాల్ భుజాన్ని ఢీకొడుతూ బౌలింగ్ చేయడాన్ని, మైకేల్ హోల్డింగ్ తాను క్రికెటర్‌నని మరిచిపోయి ఫుట్‌బాలర్ లాగా వికెట్లను తన్నడాన్ని గుర్తు చేయాలి. అలాంటి ఘటనలు వెస్టిండిస్ క్రికెట్‌పై చాలా ప్రభావం చూపించాయి' అని అన్నాడు.

'1988లో పాకిస్థాన్‌తో సిరీస్‌లో వెస్టిండిస్ గట్టెక్కడానికి అంపైరింగ్ నిర్ణయాలే కారణం. ఇక 1990లో ఇంగ్లండ్ మా దేశంలో పర్యటించినపుడు ఆ జట్టుకు ఎంతమాత్రం గెలిచే అవకాశం లేదన్నారు. కానీ జమైకాలో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించంది. రెండో టెస్టులో వర్షం పడ్డాక కూడా ఆ జట్టుకు గెలుపు అవకాశాలు మెండుగానే ఉన్నాయి. అయితే మ్యాచ్‌ను డ్రాగా ముగించడానికి మా జట్టు వక్ర మార్గాలు ఎంచుకుంది' అని తెలిపాడు.
'నిజానికి ఆ టెస్టులో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు కోసం స్టేడియ సిబ్బంది, మ్యాచ్ అధికారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మైదానంలో ఎక్కడైనా తడి ఉందన్న సంకేతం వస్తే చాలు.. చేతుల్లో ఏమీ లేకుండా సిబ్బంది మైదానంలోకి పరుగెత్తేవాళ్లు. రెండు గంటల విరామం తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభం అయింది. ఇంకా ఇంగ్లండ్‌కే టెస్టు నెగ్గే అవకాశాలు ఉన్నాయి. కానీ మా బౌలర్లు మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం కోసం గంట వ్యవధిలో కేవలం ఏడు ఓవర్లే వేశారు. దీంతో చీకటి పడటంతో అంఫైర్లు మ్యాచ్‌ని డ్రాగా ప్రకటించారు' అని లారా అన్నాడు.
'నేనప్పుడు జట్టులో 12వ ఆటగాడిని. లేసులు, అరటిపళ్లు, నీళ్లు, దగ్గు మాత్రలు, ఇలా ఏవేవో పట్టుకుని పదే పదే మైదానంలోకి వెళ్లా. అలా చేసినందుకు నాకు చాలా సిగ్గుగా అనిపించింది. తర్వాతి మ్యాచ్‌ను ఇంగ్లాండ్ డ్రాగా ముగించడానికి మంచి అవకాశాలున్న సమయంలో ఆ జట్టు ఆటగాడు బెయిలీ అవుట్ అంటూ స్లిప్‌లో ఉన్న మా ఆటగాడు బెదిరిస్తున్నట్లుగా అప్పీల్ చేస్తూ అంపైర్ మీదికి దూసుకెళ్లాడు. ముందు నాటౌట్ అన్నట్లుగా కనిపించిన అంపైర్ చివరికి అవుట్ ఇచ్చాడు' అని లారా పేర్కొన్నాడు.

'ఇంగ్లాండ్‌కు అప్పుడు ఆట మీదే నమ్మకం పోయింది. ఆ తర్వాత ఆంటిగ్వాలో జరిగిన టెస్టులో వెస్టిండిస్ విజయం సాధించడంతో 2-1తో సిరీస్ వెస్టిండిసే కైవసం చేసుకుంది. ప్రపంచ అత్యుత్తమ జట్టు అలా ఆడి ఉండాల్సి కాదు. ఈ ఆట తీరుపై నేను ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యా. ఓ యువ క్రికెటర్‌గా ఇది ఎంతమాత్రం మంచిది కాదని అనిపించింది' అన్నాడు.
'నిజానికి ఇలాంటి విజయాల మత్తులో వెస్టిండిస్ జట్టు లోపాల్ని పట్టించుకోలేదు. దాని ఫలితమే ఆ జట్టు పతనం. 1995లో మా జట్టు టెస్టు సిరీస్ ఓడటం గురించి అందరూ చర్చించుకున్నారు. గొప్ప ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పుడే మొదలైంది. 1988, 90ల్లో మేం ఓడిపోయి ఉంటే మా దేశ క్రికెట్‌ను చక్కదిద్దడానికి అప్పుడే ప్రయత్నాలు జరిగి ఉండేవి. కానీ అలా జరగలేదు' అని లారా పేర్కొన్నాడు.