
గయానా: మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదకర వైరస్ ఇప్పటికే లక్షల మందిని పొట్టనపెట్టుకోగా.. ఎందరో ఈ మహమ్మారి బారిన పడ్డారు. కరోనా కేవలం వ్యాపారంపైనే కాకుండా క్రీడా రంగంపై కూడా భారీ ప్రభావాన్ని చూపుతోంది. కరోనా కారణంగా అన్ని దేశాల క్రికెట్ బోర్డులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నాయి. ఆర్థికంగా బలమైన బోర్డు అయిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా వైరస్ ముందు తలొంచింది. ఇక వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (సీడబ్ల్యూఐ) కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నది.
కనీసం ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో సీడబ్ల్యూఐ ఉంది. గత జనవరి నుంచి అంతర్జాతీయ క్రికెటర్లతో పాటు దేశవాళీ మ్యాచ్‌లు ఆడిన వారికి ఇప్పటి వరకు వేతనాలు అందలేదు. దీనిపై వెస్టిండీస్ క్రికెటర్స్ ప్లేయర్స్ అసోసియేషన్ (డబ్ల్యూఐపీఏ) కార్యదర్శి వెయిన్ లూయిస్ గురువారం స్పందించాడు. గత జనవరిలో స్వదేశంలో ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌తో పాటు శ్రీలంక పర్యటనలో ఆడిన పురుషుల జట్టుకు మ్యాచ్ ఫీజులు చెల్లించలేదు అని పేర్కొన్నాడు.
'ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఆడిన మహిళల జట్టు పరిస్థితి కూడా అలానే ఉంది. దీనికి తోడు దేశవాళీ క్రికెటర్లకు నెల జీతాలు చెల్లించినా.. ఎనిమిది రౌండ్లకు ఇంకా ఇవ్వాల్సి ఉంది' అని వెయిన్ లూయిస్ అన్నాడు. ఇదిలా ఉంటే.. త్వరలోనే క్రికెటర్లందరికీ మ్యాచ్ ఫీజులు చెల్లిస్తామని క్రికెట్ వెస్టిండీస్ సీఈవో జానీ గ్రేవ్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. 'క్రికెట్ వెస్టిండీస్ ఆర్థికంగా చాలా కష్టాలను ఎదుర్కొంటోంది. కొంత డబ్బు ఉంది కానీ.. కొందరికి చెల్లించడానికి ప్రయత్నిస్తున్నాం. శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లకు ఆతిథ్యమిచ్చినప్పుడు మేము 22 మిలియన్ డాలర్లు నష్టపోయాం' అని చెప్పుకొచ్చాడు.
మరోవైపు సంక్షోభం నుంచి బయటపడటం కోసం క్రికెట్ ఆస్ట్రేలియా చర్యలను చేపడుతోంది. దీనిలో భాగంగా జూన్ వరకు కొంత మంది ఉద్యోగులను తాత్కాలికంగా తొలిగిస్తున్నామని సీఏ ప్రకటించింది. అయితే అప్పటివరకు వారి ఉపాధి కోసం తమ స్పాన్సర్లలో ఒకరైన ఊల్వర్త్స్ సూపర్ మార్కెట్‌లో ఉద్యోగాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా ముఖ్య కార్యనిర్వాహణ అధికారి కెవిన్ రాబర్ట్స్ ఓ ప్రకటనలో తెలిపారు.