
హైదరాబాద్: నెల రోజుల భారత పర్యటన కోసం వెస్టిండిస్ జట్టు గురువారం ముంబైకి చేరుకుంది. ఈ సందర్భంగా వెస్టిండిస్ జట్టులోని ఆటగాళ్లకు భారత సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. హోటల్‌లోకి అడుగుపెట్టక ముందే డప్పులతో వాళ్లకు స్వాగతం పలికారు.
అనంతరం హోటల్ లోపలికి వెళ్లిన తర్వాత జట్టులోని ఆటగాళ్లకు బొట్టు పెట్టి, హారతి ఇచ్చి, మెడలో హారాలు సైతం వేశారు. భారత్‌లో అడుగుపెట్టిన వీడియోలను వెస్టిండిస్ క్రికెట్ బోర్డు తన ఇనిస్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది.
అక్టోబర్ 4 నుంచి ఈ పర్యటన ప్రారంభం కానుంది.
భారత పర్యటనలో భాగంగా వెస్టిండిస్ జట్టు రెండు టెస్టులు, ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య తొలి టెస్టు రాజ్ కోట్ వేదికగా, రెండో టెస్టు హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఆ తర్వాత ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఉంటాయి.
తొలి టెస్టు రాజ్‌కోట్ వేదికగా అక్టోబర్ 4 నుంచి ప్రారంభం కానుంది. రెండో టెస్టు అక్టోబర్ 12 నుంచి హైదరాబాద్ వేదికగా జరగనుంది. వెస్టిండిస్ 1948 నుంచి ఇప్పటివరకు ఇండియాలో 94 టెస్టులు ఆడింది. అందులో 30 గెలవగా, 20 మ్యాచుల్లో ఓడింది. మరో 46 డ్రాగా ముగిశాయి.
భారత పర్యటనకు వచ్చిన వెస్టిండిస్ జట్టు:
జేసన్ హోల్డర్ (కెప్టెన్), సునీల్ ఆంబ్రిస్, దేవేంద్ర బిషూ, క్రెయిగ్ బ్రాత్‌వెయిట్, రోస్టన్ చేజ్, షేన్ డౌరిచ్, షానన్ గాబ్రియెల్, జామర్ హామిల్టన్, షిమ్రోన్ హెట్‌మెయర్, షాయ్ హోప్, అల్‌జారీ జోసెఫ్, కీమో పాల్, కీరన్ పావెల్, కీమార్ రోచ్, జోమెల్ వారికాన్.