T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8 దశలో భాగంగా ఆదివారం కోల్‌కతా వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సమీ టీమిండియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇండియన్ క్రికెట్ అభిమానులకు 2016 నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేస్తూ.. "చరిత్ర మళ్లీ పునరావృతమయ్యే అవకాశం ఉంది" అని ఆయన పేర్కొన్నారు.
డేవిడ్ వర్సెస్ గోలియత్ పోరు
మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సమీ మాట్లాడుతూ.. సొంత గడ్డపై ఆడుతున్న భారత్‌కు 140 కోట్ల మంది మద్దతు ఉంటుందని,..ఇది 'డేవిడ్ వర్సెస్ గోలియత్' (బలవంతుడికి, బలహీనుడికి మధ్య జరిగే యుద్ధం) తరహాలో ఉంటుందని అభివర్ణించారు. అయితే, 2016లో కూడా డేవిడ్ (వెస్టిండీస్), గోలియత్ (భారత్)ను ఓడించాడని.. టీమిండియాతో జరిగే మ్యాచ్‌లో కూడా అదే జరుగుతుందని తన ఆటగాళ్లకు చెబుతానని ధీమా వ్యక్తం చేశారు.

2016 నాటి చేదు జ్ఞాపకాలు
పదేళ్ల క్రితం 2016 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ.. లెండిల్ సిమన్స్, ఆండ్రీ రస్సెల్ మెరుపు ఇన్నింగ్స్‌లతో వెస్టిండీస్ భారత్‌ను ఓడించింది. ఆ తర్వాత కోల్‌కతాలో జరిగిన ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి రెండోసారి కప్‌ను ముద్దాడింది. ఇప్పుడు మళ్లీ అదే వేదికపై భారత్‌తో తలపడుతుండటంతో వెస్టిండీస్ శిబిరంలో ఉత్సాహం నెలకొంది.
విండీస్ బ్యాటింగ్ లోతు.. హెట్మెయర్ ఫామ్
వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్ లోతుపై డారెన్ సమీ ప్రశంసలు కురిపించారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 83/7 నుంచి 176 పరుగుల వరకు జట్టును తీసుకెళ్లడం వారి పోరాట పటిమకు నిదర్శనమని చెప్పారు. ముఖ్యంగా షిమ్రాన్ హెట్మెయర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని (6 ఇన్నింగ్స్‌ల్లో 221 పరుగులు), అతను జట్టుకు పెద్ద బూస్ట్ ఇస్తున్నాడని తెలిపారు. అయితే జట్టు కేవలం ఒకరిపైనే ఆధారపడకుండా సమిష్టిగా రాణించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
"ఇది నాకౌట్ మ్యాచ్. గెలిస్తే ముందుకు వెళ్తాం, ఓడితే ఇంటికి వెళ్తాం. ప్రపంచకప్ అంటేనే పతాక స్థాయి పోటీ. రేపు మైదానంలో మా వ్యూహాలను ఎలా అమలు చేస్తామనేదే ముఖ్యం. మా కుర్రాళ్లు పోరాటానికి సిద్ధంగా ఉన్నారు." అని డారెన్ సమీ పేర్కొన్నారు.