India vs Pakistan: ఆసియా కప్ 2025లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌పై రాజకీయ వివాదం మరింత తీవ్రమైంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో శివసేన్(యూబీటీ) నేత శరద్ కోలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను టీవీల్లో ప్రసారం చేస్తే హోటళ్లను ధ్వంసం చేస్తామని ఆయన బహిరంగంగా హెచ్చరించారు. ఈ ప్రకటన ముంబైతో పాటు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. శరద్ కోలీ ఒక వీడియో సందేశంలో మాట్లాడుతూ.. "భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను ప్రసారం చేస్తే, మేము మీ హోటల్ ను ధ్వంసం చేస్తాం. బ్యాట్ తో టీవీ స్క్రీన్‌ను పగలగొడతాం" అని తీవ్రమైన ధోరణిలో బెదిరించారు.
'రక్తం, ఆట కలిసి సాగలేవు'.. శివసేన వాదన
శివసేన ఈ ఆగ్రహాన్ని ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడితో ముడిపెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ 22న పాకిస్థాన్ మద్ధతు ఉన్న ఉగ్రవాదులు 26 మంది అమాయకులను హతమార్చారు. ఈ ఘటనకు ప్రతీకారంగా భారత్ 'ఆపరేషన్ సింధూర్'ను చేపట్టింది. ఈ దాడిని ప్రస్తావిస్తూ శరద్ కోలీ మాట్లాడుతూ.. "పాకిస్తాన్ మన దేశంలో రక్తాన్ని పారించిన దేశం. అలాంటి దేశంతో క్రికెట్ ఆడటం దేశద్రోహంతో సమానం" అని అన్నారు. "రక్తం, ఆట ఎలా కలిసి సాగుతాయి? ఈరోజు సర్దార్ పటేల్ బతికి ఉంటే, ఇలాంటివి ఎప్పుడూ జరగనిచ్చేవారు కాదు" అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ కేవలం ఒక ఆట కాదని, అది దేశభక్తికి సంబంధించిన అంశమని సూచిస్తున్నాయి.

ఉద్ధవ్ ఠాక్రే పిలుపు: 'సింధూర్ రక్షా ఆందోళన్'
శివసేన-ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే వర్గం 'సింధూర్ రక్షా ఆందోళన్'ను కూడా ప్రకటించింది. పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం, బీసీసీఐపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మ్యాచ్‌ను ప్రసారం చేయడం వల్ల పాకిస్థాన్‌కు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అందుకే ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పాకిస్థాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, మహిళలు తమ ఇంటి నుంచి ఆయనకు సిందూర్‌ను పంపాలని కోరారు. ఎంపీ సంజయ్ రౌత్ కూడా ఈ మ్యాచ్‌ను "విశ్వాసఘాతుకం"గా అభివర్ణించారు.
సోషల్ మీడియాలో కూడా #BoycottINDvPAK అనే హ్యాష్‌ట్యాగ్ విస్తృతంగా ట్రెండ్ అవుతోంది. విపక్షాలు ఈ మ్యాచ్ ప్రసారాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభం కానుంది. క్రికెట్ మ్యాచ్‌పై రాజకీయ ఉద్రిక్తతలు ప్రభావం చూపడం ఇది మొదటిసారి కాదు. విశ్లేషకులు ఈ రాజకీయ పరిస్థితులు ఆటపై కూడా ప్రభావం చూపుతాయని అభిప్రాయపడుతున్నారు.