రాహుల్ ద్రవిడ్ స్థానంలో టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు అందుకునే వ్యక్తి గురించి బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ ఆఫర్ ఇస్తున్నా కోచ్ పదవిని చేపట్టడానికి విదేశీ మాజీ క్రికెటర్లు ఆసక్తి చూపించట్లేదని గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో జై షా వివరణ ఇచ్చాడు. మాజీ ఆస్ట్రేలియన్ ప్లేయర్లు రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్‌లను అసలు బీసీసీఐ సంప్రదించలేదని తెలిపాడు.
స్టీఫెన్ ఫ్లెమింగ్, రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్ కోసం భారత క్రికెట్ బోర్డు ప్రయత్నించినప్పటికీ వాళ్లు ఆసక్తి చూపట్లేదని కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు అందుకున్న తర్వాత కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపలేమోననే ఆలోచనతో తిరస్కరించానని పాంటింగ్ చెప్పాడు.ఫ్లెమింగ్ కూడా దాదాపు అదే కారణం చెప్పాడు.

మరోవైపు జస్టిన్ లాంగర్ టీమిండియా హెడ్ కోచ్ పదవి చుట్టూ ఒత్తిడితో పాటు రాజకీయాలు ఉంటాయని, ఈ విషయాన్ని కేఎల్ రాహుల్ తనకు చెప్పాడని అన్నాడు. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో జై షా కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు కోచ్ పదవికి ఆస్ట్రేలియన్లను సంప్రదించలేదని, మన దేశవాళీ క్రికెట్ సిస్టమ్ గురించి లోతైన అవగాహన ఉన్నవారినే ఎంపిక చేస్తామని అన్నాడు.
''భారత క్రికెట్ నిర్మాణంపై లోతైన అవగాహన ఉన్న వారి కోసం, అంచెలంచెలుగా ఎదిగిన వాళ్లపై దృష్టిసారించాం. టీమిండియాను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడానికి మన కోచ్‌కు దేశవాళీ క్రికెట్‌పై లోతైన పరిజ్ఞానం ఉండటం ఎంతో కీలకం'' అని జై షా అన్నాడు. జై షా వ్యాఖ్యలను బట్టి భారత మాజీ క్రికెటరే కోచ్ రేసులో ఉన్నాడని స్పష్టమవుతోంది. గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రాతో పాటు హర్భజన్ సింగ్ పోటీలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
అయితే నెహ్రా, హర్భజన్ సింగ్ కంటే గంభీర్‌పైనే బీసీసీఐ ఆసక్తితో ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఐపీఎల్‌లోనూ గంభీర్ తన మార్క్‌ను చూపించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. గంభీర్ రాకతో కేకేఆర్ జట్టులో దూకుడు పెరిగింది. టైటిల్‌కు అడుగు దూరంలోనే నిలిచింది. ఈ నేపథ్యంలో టీమిండియా కొత్త కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎంపికవుతాడని జై షా కూడా పరోక్షంగా హింట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.