INDvsSL: తొలి టీ20కి సర్వం సిద్ధం.. వాతావరణం ఎలా ఉండబోతోందంటే?

కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించడానికి టీమిండియా సిద్ధం అవుతోంది. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌తో ఈ ఏడాదిని ఆరంభిస్తోంది. వీటిలో తొలి మ్యాచ్ మంగళవారం నాడు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచులో టీమిండియా సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్ తదితరులు ఆడటం లేదు. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా నిష్క్రమణ తర్వాత.. పొట్టి ఫార్మాట్‌లో యువ ఆటగాళ్లతో ముందుకెళ్లాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సీనియర్లు లేని జట్టు..
ఈ నేపథ్యంలోనే శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేశారు. చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లను ఈ సిరీస్ కోసం సెలెక్ట్ చేయలేదు. అయితే టీ20 సిరీస్ తర్వాత మొదలయ్యే వన్డే సిరీస్‌లో మాత్రం వీళ్లంతా ఆడనున్నారు. ఈ నేపథ్యంలోనే టీ20 సిరీస్‌కు ప్రకటించిన జట్టు పగ్గాలను హార్దిక్ పాండ్యాకు అప్పగించారు. అతని డిప్యూటీగా ఎవరూ ఊహించని విధంగా సూర్యకుమార్‌ను ఎంపిక చేశారు.

జట్టులో స్థానం కోసం పోటీ..
ఈ మ్యాచులో తుది జట్టులో స్థానం కోసం రాహుల్ త్రిపాఠీ, రుతురాజ్ గైక్వాడ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే ఇటీవల దేశవాళీల్లో వన్డే ఫార్మాట్‌లో రుతురాజ్ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. దీంతో టీం మేనేజ్‌మెంట్ అతనికే ఓటేసే అవకాశం ఉంది. అలాగే వికెట్ కీపర్ స్థానం కోసం సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ పోటీ పడుతున్నారు. అయితే వీళ్లలో ఒకరు ఓపెనర్ కాగా, మరొకరు ఫినిషర్ స్థానంలో ఆడతారు. కాబట్టి ఇద్దరికీ తుది జట్టులో స్థానం దొరికే అవకాశం ఉంది.

వాతావరణం ఎలా ఉండబోతోంది?
ఇక వాంఖడేలో సాయంత్రం వాతావరణ సంగతి చూస్తే.. తొలి టీ20కి ఎలాంటి ఆటంకాలు ఎదురు కావని తెలుస్తోంది. ఇక్కడ వర్షం పడే అవకాశం ఏమాత్రం లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఇక్కడ 25-27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందని, వర్షం పడే అవకాశం శూన్యమని అధికారులు చెప్పారు. గాల్లో తేమ 60 శాతం ఉండగా, ఆకాశంలో 45 శాతం మేఘావృతమై ఉంటుందన్నారు. అంతకుమించి వాతావరణంలో ఎలాంటి మార్పులు ఉండబోవన్నారు. అంటే మంగళవారం సాయంత్రం క్రికెట్ అభిమానులకు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుందన్నమాట.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications