హైదరాబాద్: భారత తరుపున టెస్టుల్లో ఓపెనర్‌గా రాణిస్తున్న ఆటగాళ్లలో తమిళనాడుకు చెందిన మురళీ విజయ్ ఒకడు. అయితే ఇటీవల కాలంలో గాయాల కారణంగా మురళీ విజయ్ బెంచ్‌కే పరిమితమవుతున్నాడు. మూడు ఫార్మెట్లలో రాణించాలని మురళీ విజయ్ అనుకుంటున్నా, ఈ మేరకు జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు.
అంతేకాదు, టెస్టు క్రికెటర్‌గా మాత్రమే మురళీ విజయ్ ముద్ర వేసుకున్నాడు. ఈ క్రమంలో శనివారం మురళీ విజయ్ మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 23 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో తప్పక రాణిస్తాననే ఆశాభావం వ్యక్తం చేశాడు.

'భారత క్రికెట్ జట్టు తరపున అన్ని ఫార్మాట్లలో ఆడాలనేది నా కోరిక. దాని ప్రకారమే నా ఆట తీరును ఎప్పటికప్పుడూ మార్చుకుంటూనే ఉన్నా. అయితే సెలక్షన్ కమిటీ అనేది నా చేతుల్లో లేదు. నా స్కిల్‌ను పెంచుకోవడంతో పాటు ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంపైనే దృష్టి సారించడమే నా పని. ఇప్పటికే టెస్టు ఫార్మాట్లో నన్ను నేను నిరూపించుకున్నప్పటికీ, ఇంకా నిలకడగా ఆడటం కోసం యత్నిస్తున్నా' అని మురళీ విజయ్ అన్నాడు.
టెస్టు క్రికెట్‌లో 3000కు పైగా పరుగులు చేసిన ఆటగాళ్లలో అతి తక్కువ స్ట్రయిక్ రేటు నమోదు చేసిన ఆటగాళ్లలో మురళీ విజయ్ ఒకడు. మురళీ విజయ్ స్ట్రయిక్ రేట్ 46.15గా ఉంది. దీంతో మురళీ విజయ్ మాట్లాడుతూ సాధారణంగా స్ట్రయిక్ రేట్ గురించి బౌలర్లు మాత్రమే వర్రీ అవుతారని బ్యాట్స్మెన్లు కాదని అన్నాడు.
బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడుతూ భారీ స్కోర్లు సాధించాలని, ప్రస్తుతం తాను దానినే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పాడు. ఆస్ట్రేలియాతో జరిగే టెస్టుల్లో బౌన్సీ వికెట్లకు ఛాన్స్ ఉంటుంది కాబట్టి సాధ్యమైనన్ని బౌండరీలు సాధిస్తానని చెప్పుకొచ్చాడు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి ఏమైనా నేర్చుకున్నారా? అన్న ప్రశ్నకు గాను కోహ్లీపై మురళీ విజయ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా చక్కటి ప్రణాళిక అనేది కోహ్లీ సొంతమని చెప్పాడు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా కోహ్లీ చాకచక్యంగా వ్యవహరించి జట్టును కాపాడే తీరు నిజంగా అద్భుతమని అన్నాడు.
మిగతా ఆటగాళ్ల ఎదుగుదలను కూడా కోహ్లీ ఎంతగానో ప్రోత్సహిస్తాడని చెప్పాడు. మూడు ఫార్మెట్లలో సత్తా చాటుతున్న కోహ్లీ ఎంతో మంది యువ ఆటగాళ్లకు ఆదర్శమని అన్నాడు. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో సత్తా చాటిన ఏకైక క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే అది కోహ్లీ మాత్రమేనని చెప్పాడు.