
హైదరాబాద్: ఐపీఎల్ 2018లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘోరపరాజయం చవిచూసింది. కేవలం బౌలింగ్ తప్ప బ్యాటింగ్ విభాగంలో చతికిల బడ్డ ముంబై జట్టు హాస్యాస్పదంగా ఓటమి పాలైంది. ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ పరుగులు (87) రెండోసారి నమోదుచేసిన ముంబై.. 31 పరుగుల తేడాతో ఓటమిపాలై చెత్తరికార్డును మూట గట్టుకుంది. ఈ విషయంపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అనూహ్య వ్యాఖ్యలు చేశాడు.
'ఓడిపోయినందుకు మమ్మల్ని మేము నిందించుకోవాల్సిందే. పిచ్ స్వభావం ఎలాంటిదైనా కావచ్చు.. ఇంత చిన్న(118 పరుగుల) లక్ష్యాన్ని సునాయాసంగా ఛేధింగల సత్తా మా జట్టుకు ఉంది. కానీ అలాంటి పాత్ర పోషించలేకపోయాం. ఇలా ఎందుకు జరిగిందో బోలెడు కారణాలు చెప్పగలను. కానీ, మా లోపాలను మేమే ఎత్తిచూపుకోవడం ప్రస్తుతానికి ఇష్టంలేదు. ముమ్మాటికీ తప్పు మాదే. బౌలర్లు అద్భుతంగా రాణించినా, బ్యాట్స్‌మన్లు దారుణంగా విఫలమయ్యారు. వ్యక్తిగతంగా నేను కూడా చెత్తగా ఆడానని చెప్పక తప్పదు. తక్కువ స్కోరును డిఫెండ్ చేసుకోవడంలో సన్‌రైజర్స్ బాగా ఆడారు' అని రోహిత్ చెప్పాడు.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును బౌలింగ్, ఫీల్డింగ్‌తోనూ కట్టుదిట్టం చేసింది ముంబై జట్టు. ఇప్పటి వరకూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఓడించి ఒక్క మ్యాచ్ ను మాత్రమే గెలుచుకున్న ముంబై జట్టు తక్కువ స్కోరు లక్ష్యాన్ని ఛేదిస్తుందని అందరూ గట్టిగా నమ్మారు. కానీ, అందరూ ఆశించినంతగా ముంబై ఇండియన్స్ స్కోరు చేయలేకపోగా చాలా తక్కువ స్కోరును చేయగలిగింది.
మంగళవారం నాటి మ్యాచ్‌తో ఐదు ఓటములు మూటగట్టుకున్న ముంబై పాయింట్ల పట్టికలో 7వ స్థానానికి పడిపోయింది. ముంబై తదుపరి మ్యాచ్ ఏప్రిల్ 28న చెన్నైతో ఆడనుంది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానానికి ఎగబాకింది. ఏప్రిల్ 26న హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్.. పంజాబ్‌తో తలపడనుంది.