2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌ను క్రికెట్ అభిమానులు అంత ఈజీగా మరిచిపోలేరు. టైటిల్ కోసం ఇంగ్లాండ్-న్యూజిలాండ్ అద్భుతంగా పోరాడాయి. మొదట మ్యాచ్ టైగా ముగిసింది. దాంతో ఫలితం కోసం సూపర్ఓవర్‌ను నిర్వహించారు. కానీ సూపర్ ఓవర్ స్లోర్లు కూడా సమం అయ్యాయి. అనంతరం నిబంధనల ప్రకారం బౌండరీల కౌంట్ ఎక్కువగా ఉన్న ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు.
అయితే ఆ ఫైనల్ మ్యాచ్‌కు అంపైర్ బాధ్యతలు నిర్వర్తించిన మరియస్ ఎరాస్మస్ సంచలన విషయాలు వెల్లడించాడు. తుదిపోరులో తాము చేసిన తప్పు వల్ల ఆ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసిందని అన్నాడు. అయిదు పరుగులకు బదులుగా ఆరు పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ టైగా ముగిసిందని పేర్కొన్నాడు. తన సహచర అంపైర్ కుమార్ ధర్మసేనతో కలిసి ఈ భారీ తప్పిదాన్ని చేసినట్లుగా వివరించాడు. అసలేం జరిగిదంటే..

ఇంగ్లండ్ విజయానికి చివరి మూడు బంతుల్లో 9 పరుగులు అవసరమయ్యాయి. ఈ స్థితిలో బౌల్ట్ వేసిన ఫుల్ టాస్‌ను బెన్ స్టోక్స్ డీప్ మిడ్ వికెట్ మీదుగా షాట్ ఆడాడు. గప్తిల్ బంతిని అందుకొని త్రో విసిరాడు. మరోవైపు స్టోక్స్- అదిల్ రషీద్ డబుల్స్‌కు ప్రయత్నించారు. కానీ గప్తిల్ వేసిన త్రో.. స్టోక్స్ బ్యాటుకు తగిలి బౌండరీకి వెళ్లింది. దీంతో అంపైర్లు రెండు పరుగులకు ఓవర్ త్రో ద్వారా వచ్చిన నాలుగు పరుగులను కలిపి (2+4=6) మొత్తంగా ఇంగ్లండ్‌కు సిక్స్ రన్స్‌ను ఇచ్చారు. ఆ తర్వాత రెండు బంతులకు ఇంగ్లండ్ రెండు పరుగులు చేసి స్కోరును సమం చేసింది. ఆ తర్వాత సూపర్ ఓవర్‌లో బౌండరీ కౌంట్‌తో విజయం సాధించింది.
అయితే రూల్స్ ప్రకారం..ఓవర్ త్రో ద్వారా బౌండరీ వచ్చిన సందర్భాల్లో నాలుగు పరుగులతో పాటు బ్యాటర్లు తీసిన రన్స్‌ను కూడా బ్యాటింగ్ జట్టుకు ఇస్తారు. అంతేగాక ఫీల్డర్ త్రో విసిరే సమయానికి మరో పరుగు కోసం ఇద్దరు బ్యాటర్లు క్రీజు దాటినా దాన్ని కూడా పరిగణిస్తారు.ఈ నిబంధన ప్రకారం ఇంగ్లండ్‌కు ఆ సమయంలో అయిదు పరుగులే రావాల్సి ఉంది. ఎందుకంటే గప్తిల్ త్రో విసిరే సమయారికి స్టోక్స్, రషీద్ ఇద్దరూ క్రీజును దాటలేదు.
''ఫైనల్ అనంతరం తర్వాత రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కోసం నా గది తలుపు తెరిచాను. అదే సమయంలో కుమార్ ధర్మసేన కూడా బయటకు వచ్చాడు. 'మనం చేసిన తప్పును నువ్వు చూశావా' అని ధర్మసేన అడిగాడు. అప్పుడు ఆ విషయం గురించి నాకు తెలిసింది. మ్యాచ్ సమయంలో మేమిద్దరం 'ఆరు పరుగులు'గా భావించాం. కానీ బ్యాటర్లు క్రాస్ అయ్యారా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోలేకపోయాం'' అని మరియస్ ఎరాస్మస్ పేర్కొన్నాడు. అంపైర్లు ఆ తప్పిదం చేయకపోతే న్యూజిలాండ్ ఒక్క పరుగు తేడాతో ప్రపంచకప్ విజయం సాధించేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.