
దుబాయ్: గత ఐపీఎల్ మ్యాచ్‌ను టీమిండియా క్రికెటర్, సన్ రైజర్స్ హైదారాబాద్ బ్యాట్స్‌మన్ మనీశ్ పాండే గుర్తుచేసుకున్నాడు. ఓ మ్యాచ్‌లో చివరి బంతికి సిక్స్ బాదినా.. మ్యాచ్ గెలవలేకపోయాం అని తెలిపాడు. తన తండ్రే తనకు ఆదర్శమని చెప్పాడు. ఐపీఎల్ 2020 కోసం దుబాయ్‌లోని ఓ హోటల్‌లో బస చేస్తున్న మనీశ్ ప్రస్తుతం క్వారెంటైన్‌లో ఉన్నాడు. శనివారంతో సన్ రైజర్స్ ఆటగాళ్ల 6 రోజుల క్వారంటైన్ ముగియనుంది.
మనీశ్ పాండే తాజాగా ట్విటర్ వేదికగా అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని అతడికి ఆదర్శమైన వ్యక్తి ఎవరని ప్రశ్నించాడు. 'మా నాన్న ఎప్పుడూ జీవితం గురించి చాలా విషయాలు నాతో పంచుకునేవారు. నేను కూడా ఆయన అడుగుజాడల్లోనే పెరిగాను. కాబట్టి కచ్చితంగా నాన్నే నాకు ఆదర్శం' అని పాండే చెప్పాడు. ఇష్టమైన మ్యాచ్ ఏదని మరో అభిమాని అడగ్గా.. గతేడాది ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడిన 51వ మ్యాచ్ అని గుర్తుచేసుకున్నాడు.
'ఆ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదారాబాద్ 162 పరుగుల లక్ష్యం ఛేదించాల్సి ఉంది. ఇన్నింగ్స్ చివరి బంతికి సిక్స్ బాదాల్సి రాగా.. నేనే బ్యాటింగ్ చేశా. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో చివరి బంతిని సిక్స్‌గా మలిచా. మ్యాచ్ టైగా ముగిసింది. తర్వాత సూపర్ ఓవర్‌లో ముంబై గెలిచింది' అని సన్‌రైజర్స్ బ్యాట్స్‌మన్ మనీశ్ పాండే తెలిపాడు.
ఆ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలవాలంటే ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు కావాలి. అప్పుడు క్రీజులో మహ్మద్ నబీ (24), మనీశ్ పాండే (62) మ్యాచ్‌ను గెలిపించే ప్రయత్నం చేశారు. తొలి రెండు బంతులకు సింగిల్స్ రాగా, మూడో బంతిని నబీ సిక్స్‌గా మలిచాడు. నాలుగో బంతిని కూడా అలాగే ఆడబోయి క్యాచ్ ఔటయ్యాడు. ఇక రెండు బంతుల్లో 9 పరుగులు అవసరం కాగా.. మనీశ్ అయిదో బంతికి రెండు పరుగులు చేశాడు. ఆరో బంతికి సిక్స్ సాధించాడు. దీంతో మ్యాచ్ టైగా మారింది.
ఇక సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదారాబాద్ ఏడు పరుగులే చేసి.. రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం ముంబై ఇండియన్స్ సునాయాస విజయం సాధించింది. మ్యాచ్ ఓడినా అదే తనకు చాలా ఇష్టమైన మ్యాచ్ అని మనీశ్ చెప్పుకొచ్చాడు. పాండే భారత్ తరఫున 26 వన్డేలు, 38 టీ20లు ఆడాడు.