
హైదరాబాద్: టీమిండియా ప్రస్తుతం అత్యుత్తమ పేస్ బౌలింగ్ ఎటాక్‌ను కలిగి ఉందని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. దక్షిణాఫ్రికాలో వీళ్లు సత్తా చాటుతారని ఆశాభావం వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికా వెళ్లనున్న ఐదుగురు పేసర్ల బృందం ఆ దేశంలో గతంలో పర్యటించిన భారత ఫాస్ట్ బౌలింగ్ బృందంతో పోలిస్తే అత్యుత్తమమైనదని కితాబిచ్చాడు.
గురువారం మీడియాతో మాట్లాడిన ఎమ్మెస్కే ఇషాంత్, ఉమేశ్, షమీ, భుమీ, బుమ్రాలలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రత్యేకత చూపగలిగినవారేనని అన్నాడు. 'ప్రత్యర్థి బౌలింగ్ గురించి మాట్లాడను. మనవైపు మాత్రం విభిన్న వనరులున్నాయి. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తున్న భారత అత్యుత్తమ బౌలింగ్ విభాగం ఇదే' అని తెలిపాడు.
'ఉమేశ్, షమీ 140 కి.మీ. వేగంతో బంతులేస్తూ స్వింగూ చేయగలరు. భువనేశ్వర్ రెండు వైపులా స్వింగ్ చేయగల సమర్థుడు. బుమ్రా బౌలింగ్‌లో వైవిధ్యం ఎక్కువ. ఇషాంత్‌శర్మ ఉండనే ఉన్నాడు. హార్దిక్ పాండ్యాతో బౌలింగ్ విభాగానికి మరింత వైవిధ్యం వస్తుంది. స్వదేశంలో విజయాలు సాధించి వెళ్తుండటం ఆత్మవిశ్వాసం పెంచుతుంది' అని తెలిపాడు.
'దీనికితోడు మంచి జట్టు, అన్నిటికి మించి నంబర్ 1 టెస్టు జట్టు హోదాలో వెళ్తున్నాం. ఇక, రహానే ఫామ్‌పై మాకెలాంటి ఆందోళన లేదు. అతను కీలక ఆటగాడు. విదేశాల్లో అతనికి మంచి రికార్డుంది' అని ఎమ్మెస్కే తెలిపాడు. ఐదుగురు భిన్నమైన బౌలర్లను ఎంపిక చేయడం వల్ల దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ గెలుస్తుందని అన్నాడు.
స్వదేశంలో టెస్టుల్లో ఎక్కువ విజయాలు ఉన్నా.. విదేశాల్లో రికార్డును మెరుగుపర్చాల్సి ఉందని ఈ సందర్భంగా ఎమ్మెస్కే ఆశాభావం వ్యక్తం చేశాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.