సొంతిల్లు లేదు..ఐపీఎల్ డబ్బులతో అమ్మ నాన్నల కల నెరవేరుస్తా: హైదరాబాదీ తిలక్ వర్మ


ముంబై: తిలక్ వర్మ.. హైదరాబాదీ క్రికెటర్. ఐపీఎల్ 2022 సీజన్‌లో తెరపైకి వచ్చిన కొత్త స్టార్. బలమైన ముంబై ఇండియన్స్‌కు ఆపద్బాంధవుడిగా మారాడు. తొలి మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించుకున్నప్పటికీ.. రెండో గేమ్‌లో రాణించాడు. హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. మ్యాచ్‌ను కోల్పోయినప్పటికీ.. ముంబై ఇండియన్స్ స్కోరు 170 పరుగుల వరకు వెళ్లిందంటే దానికి కారణం తిలక్ వర్మే. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కీరన్ పొల్లార్డ్ వంటి హేమాహేమీల్లాంటి బ్యాటర్లు ఉన్న జట్టు మొత్తానికీ టాప్ స్కోరర్ అతనే.

హాఫ్ సెంచరీతో..
రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో 33 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఇందులో అయిదు భారీ సిక్సర్లు, మూడు బౌండరీలు ఉన్నాయి. భారత క్రికెట్ భవిష్యత్ ఆశాకిరణంలా కనిపించాడీ హైదరాబాదీ ప్లేయర్. జట్టు గెలవాలంటే 194 పరుగులు చేయాల్సిన ఉండగా.. 40 పరుగులకే రెండు వికెట్లను జట్టు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు దిగిన తిలక్ వర్మ.. చివరి వరకూ పోరాడాడు. జట్టు స్కోరు 135 పరుగుల వద్ద ఉన్న సమయంలో అవుట్ అయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఇల్లు కొంటా..
ఈ ఉదయం అతను ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన లక్ష్యాలు ఏమిటో వెల్లడించాడు. ఇప్పటివరకు తమకు సొంత ఇల్లు లేదని, అద్దెె ఇంట్లో నివసిస్తున్నామని చెప్పాడు. ఐపీఎల్ ఆడటం ద్వారా వచ్చిన రెమ్యునరేషన్‌తో ఓ ఇల్లు కొంటానని పేర్కొన్నాడు. సొంత ఇల్లును కొనాలనేది తన తల్లిదండ్రుల కల అని, దాన్ని నెరవేరుస్తానని అన్నాడు. ఐపీఎల్ ద్వారా వచ్చిన డబ్బులు తన జీవితాన్ని మార్చేస్తాయని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, మరింత స్వేచ్ఛగా, ఏకాగ్రతగా ఆడటానికి అవకాశాన్ని కల్పిస్తాయని అన్నాడు.

లక్ష్యాలు చాలా..
సొంత ఇంటిని కొనడంతో పాటు టీమిండియా తరఫున టెస్ట్ మ్యాచ్‌లల్లో ఆడటం, ప్రపంచ కప్ ఆడే జట్టులో చోటు దక్కించుకోవడం వంటి అనేక లక్ష్యాలు ప్రస్తుతం తన ముందు ఉన్నాయని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ అని, ఈ ఫ్రాంఛైజీ తరఫున ఆడాలనే తన కల నెరవేరిందని చెప్పాడు. ముందు నుంచీ తాను ఈ జట్టును అభిమానిస్తున్నానని అన్నాడు. సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ, కీరన్ పొల్లార్డ్, జస్‌ప్రీత్ బుమ్రా వంటి లెజెండరీలను చూసి చాలా నేర్చుకున్నానని పేర్కొన్నాడు.

ఆత్మవిశ్వాసం పెరిగింది..
అలాంటి జట్టులో చోటు దక్కించుకున్న తరువాత.. తన ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని వ్యాఖ్యానించాడు. తన లక్ష్యాలన్నింటినీ నెరవేర్చుకోవడానికి అవసరమైన స్థైర్యాన్ని ఇచ్చిందని చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో తాను సాధించిన అర్ధసెంచరీని కోచ్, తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నానని తిలక్ వర్మ అన్నాడు. తల్లిదండ్రులు, కోచ్.. తన కేరీర్‌లో కీలకమైన వ్యక్తులని, వారివల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నాననీ చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications