ఆత్మగౌరవానికి ఓ హద్దు ఉంటుంది: ఆసీస్ గడ్డపై దూకుడుకి అర్ధం చెప్పిన కోహ్లీ


హైదరాబాద్: మైదానంలో పరిస్థితి బట్టి మా దూకుడు ఆధారపడి ఉంటుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టీ20 గబ్బా స్టేడియంలో బుధవారం జరగనుంది.
ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ తమ ఆత్మగౌరవానికి ఓ హద్దు ఉంటుందని చెప్పాడు. "మైదానంలో పరిస్థితిని బట్టి మా దూకుడు ఉంటుంది. ప్రత్యర్థి మా పట్ల అదేతీరుతో ఉంటే మేం ప్రతిఘటించాల్సి వస్తుంది. టీమిండియా ముందుగా ఏదీ మొదలుపెట్టదు. మాకూ ఆత్మగౌరవం ఉంటుంది" అని అన్నాడు.
"ఆ హద్దు దాటితే మేం తీవ్రంగా స్పందిస్తాం. మ్యాచ్‌లో పరిస్థితులను ఒక జట్టు ఎలా అధీనంలో ఉంచుకుంటుందో, ప్రతి వికెట్ కోసం ఎంత శ్రమిస్తుందో దానినే దూకుడు అంటాం. మీరు దాన్ని దేహభాషలో చూడొచ్చు. ఒక బౌలర్ వికెట్ కోసం పదేపదే ఒకే ప్రాంతంలో బంతులు వేసినప్పుడు, ఏమీ మాట్లాడకుండానే బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడొచ్చు" అని కోహ్లీ తెలిపాడు.

దూకుడు అంటే గెలవడం కోసం ఆడటం
"నా వరకు దూకుడు అంటే గెలవడం కోసం ఆడటం. నా జట్టు గెలుపు కోసం ప్రతి బంతి ఆడటం. ఒక్కొక్కరూ ఒక్కోలా దానిని భావిస్తారు. నేను మాత్రం ఏది ఏమైనా మ్యాచ్ గెలవాలని కోరుకుంటా. బ్యాటింగైనా, ఫీల్డింగైనా, చప్పట్లు కొట్టడమైనా, వికెట్ల మధ్య పరుగెత్తడమైనా నేను 120 శాతం కష్టపడతా" అని కోహ్లీ అన్నాడు.

ఫేవరేట్‌గా బరిలోకి టీమిండియా
ఇదిలా ఉంటే, ఈ సిరిస్‌లో టీమిండియా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లేకుండా ఆ జట్టు బరిలోకి దిగుతుండటం భారత్‌కు కలిసొచ్చేలా ఉంది. దీనిపై కోహ్లీ మాట్లాడుతూ ఒకరిద్దరు లేనంత మాత్రాన ఆసీస్ జట్టు బలహీనంగా ఉన్నట్టు కాదని ఇప్పటికీ అది ప్రపంచ స్థాయి జట్టేనని అన్నాడు.

ఏం జరిగిందో నాకు తెలియదు
"ఏం జరిగిందో మనం అందరం చూశాం. క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు. అయితే, ఆ దేశ బోర్డు తీసుకున్న నిర్ణయాలపై కామెంట్ చేయడం ఇష్టం లేదు. ఒకరిద్దరు బ్యాట్స్‌మెన్ లేనంత మాత్రాన ఆ జట్టు బలహీనంగా ఉన్నట్లు కాదు. ఇప్పటికీ ఆ జట్టులో ప్రపంచ స్థాయి క్రికెటర్లు ఉన్నారు" అని కోహ్లీ చెప్పాడు.
ఇద్దరు బెస్ట్ బ్యాట్స్‌మెన్ లేకున్నా
"ఆస్ట్రేలియా జట్టులోని ఇద్దరు బెస్ట్ బ్యాట్స్‌మెన్ లేకున్నా... ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేయగలదు. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించడానికి మావంతు కృషిచేస్తాం. ఏ జట్టుని కూడా తక్కువగా అంచనా వేయలేం. మొత్తం ఆస్ట్రేలియా జట్టుపై పోటీ పడేందుకు ఇక్కడకు వచ్చాం. ఆసీస్ గడ్డపై విజయం సాధించడానికి ఇదే చివరి అవకాశం అని నేను అనుకోవడం లేదు" అని కోహ్లీ అన్నాడు.
అదే ఫామ్‌ను కొనసాగిస్తాం
"ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. అదే ఫామ్‌ను కొనసాగిస్తాం" అని కోహ్లీ అన్నాడు. టీమిండియా చివరగా ఆడిన ఏడు టీ20 సిరిస్‌ల్లో విజయం సాధించింది. మరోవైపు బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత ఆస్ట్రేలియా ఆడిన ఏ సిరిస్‌లోనూ విజయం సాధించకపోవడం భారత్‌కు కలిసొచ్చే అంశం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications