న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జోరుమీదున్నాడు. ఈ విజయం తమకు ఎంతో ప్రత్యేకమైనదని కోహ్లీ చెప్పాడు. అంతేగాక, ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా, ఏ ప్రత్యర్థిపైనైనా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా.. దక్షిణాఫ్రికాతో జరిగిన 4టెస్టుల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. చివరి టెస్ట్ గెలిచిన అనంతరం కోహ్లీ మీడియా అడిగిన ప్రశ్నలకు ఉత్సాహంగా సమాధానం చెప్పాడు.

'మాకు ఎప్పుడూ జవాబు తెలుసు. మీ ప్రశ్నలకు ఈ రోజు జవాబు దొరికిందనుకుంటాను. నేను ఈ ప్రశ్నల కోసమే ఎదురుచూస్తున్నా. పిచ్‌పై ప్రశ్నలు అవసరం లేదు. బంతి మలుపులపై ప్రశ్నలు అవసరం లేదు' అని నవ్వుతూ మీడియాతో అన్నాడు.
'మీడియాలో వచ్చిన కథనాలను ప్రజలు చదువుతారు. మీరేదో చూస్తారు ఓ కథనం రాసేస్తారు. మీరు ఏదైనా ప్రత్యేక ప్రశ్న అడిగితే.. మీకు ప్రత్యేకమైన జవాబు దొరుకుతుంది. అలా కాకుండా అడిగితే నేను మరో ప్రశ్న అడగాలని కోరతా. అన్ని ప్రశ్నలకు జవాబు చెబుతా. అవి నా శైలిలోనే ఉంటాయి' అని కోహ్లీ పేర్కొన్నాడు.
'మేమంతా ఓ మంచి జట్టు. మీరు ఏది రాయాలనిపిస్తే.. అది రాసేస్తారు. అదే మేం చేయాలనుకుంటారు. ఒకవేళ మేము మంచిగా ఆడితే బాగా రాస్తారు. లేదంటే విమర్శలు చేస్తూ కథనాలు రాస్తారు. మా విజయానికి పిచ్ కారణమనడం సరికాదు' అని కోహ్లీ అన్నాడు.
మా బౌలర్ల కారణంగానే పటిష్టమైన దక్షిణాఫ్రికా జట్టును ఓడించగలిగామని చెప్పాడు. క్లిష్టమైన నైపుణ్యంతోనే ఈ గెలుపు సాధ్యమైందన్నాడు. తమ జట్టులోని అందరు సభ్యుల సమష్టి కృషి వల్లే ఈ అద్భుతమైన సిరీస్ విజయం సాధ్యమైందని కోహ్లీ తెలిపాడు.