
హైదరాబాద్: తొలి మూడు వన్డేల్లో ఓటమి పాలు కావడంతో దక్షిణాఫ్రికా జట్టు తీవ్ర ఒత్తడిలో ఉందని ఆ జట్టు ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ వ్యాఖ్యానించాడు. ఆరు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగో వన్డే జోహెన్స్‌బర్గ్ వేదికగా శనివారం ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో క్రిస్ మోరిస్ మాట్లాడుతూ సిరీస్‌లో నిలవలాంటే నాలుగో వన్డే తమకు డూ ఆర్ డై మ్యాచ్ లాంటిదని అన్నాడు. వన్డేల్లో 2013 నుంచి తమ జట్టు ఏ సిరిస్‌లోనూ వెనకబడలేదని, తొలిసారి టీమిండియా మాపై ఆధిక్యత కనబరుస్తోందని చెప్పాడు. నాలుగో వన్డేలో ఓడితే తమ నుంచి సిరీస్ చేజారుతుందని అన్నాడు.
ఇదంతా క్రికెట్‌లో భాగమేనని అన్నాడు. శనివారం జరగబోయే మ్యాచ్‌లో తాము తమ శక్తికి మించి ప్రదర్శన చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఇక, ఏబీ డివిలియర్స్ నాలుగో వన్డేలో జట్టుతో చేరడంతో కొత్త ఉత్సాహన్ని ఇచ్చిందని తెలిపాడు.
నాలుగో వన్డేలో డేవిడ్ మిల్లర్ కానీ ఖాయా జోండోలలో ఒకరికే అవకాశం లభించవచ్చునని తెలిపాడు. భారత మణికట్టు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్‌లను దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్లు ఎదుర్కోవడానికి ఎటువంటి ప్లాన్లు సిద్ధం చేయలేదని, కాస్త హార్డ్ వర్క్ చేస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డాడు.
కాగా, రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచే కార్యక్రమంలో భాగంగా ఈ మ్యాచ్‌ను 'పింక్ వన్డే'గా పరిగణిస్తున్నారు. రొమ్ము క్యాన్సర్ నిర్మూలనకు నిధులు వసూలు చేసేందుకు నిర్వహించబోయే ఈ పింక్ వన్డేలో ఇప్పటివరకు దక్షిణాఫ్రికా జట్టు ఓడిపోలేదని ఈ సందర్భంగా మోరిస్ గుర్తు చేశాడు.
2011 నుంచి దక్షిణాఫ్రికా ఐదు వన్డేల్లో పింక్ దుస్తులతో బరిలోకి దిగగా ఐదింటిలోనూ విజయం సాధించింది. సంవత్సరంలో ఒకసారి ఈ మ్యాచ్ కోసం సఫారీ ఆటగాళ్లు గులాబీ దుస్తులతో బరిలోకి దిగడం సాంప్రదాయంగా వస్తోంది. ఈ మ్యాచ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని స్థానిక చార్లొట్ మ్యాక్సికే అకడమిక్ హాస్పిటల్‌కు విరాళంగా అందజేస్తారు.
తుది జట్ల వివరాలు (అంచనా):
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రహానే, పాండ్యా, జాదవ్, ధోని, భువనేశ్వర్, కుల్దీప్, బుమ్రా, చహల్.
దక్షిణాఫ్రికా: మార్క్‌రమ్ (కెప్టెన్), ఆమ్లా, డుమిని, డివిలియర్స్, బెహర్దీన్, మిల్లర్/ జోండో, మోరిస్, ఫెలుక్‌వాయో, రబడ, మోర్కెల్, తాహిర్.
సాయంత్రం 4.30 గంటల నుంచి సోనీ టెన్-1, 3లో ప్రత్యక్ష ప్రసారం