ముంబై: భారత క్రికెట్ జట్టు కోచ్‌గా ఈసారి మన దేశానికి చెందిన ఆటగాళ్లకే అవకాశం దక్కనుందని తెలుస్తోంది. అందులో ప్రముఖంగా సౌరవ్ గంగూలీ పేరు కూడా వినిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. గంగూలీతో పాటు భరత్ అరుణ్ పేర్లు వినిపిస్తున్నాయని వార్తలు వచ్చాయి.
డంకెన్ ఫ్లెచర్ ప్రస్తుతం భారత జట్టు కోచ్‌గా ఉన్నాడు. అతని కాంట్రాక్ట్ మరికొద్ది రోజుల్లో ముగిసిపోనుంది. దీంతో తదుపరి కోచ్ పైన విస్తృతస్థాయిలో చర్చ సాగుతోంది. భారతీయుడే కోచ్‌గా ఉండాలన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఈసారి విదేశీయుడి కోసం వెంపర్లాడే పరిస్థితి ఉండకపోవచ్చునని అంటున్నారు. ప్రస్తుతం భారత జట్టుకు డైరెక్టర్‌గా ఉన్న రవిశాస్త్రి కూడా స్వదేశీ కోచ్ కోసం పట్టుబడుతున్నారంటున్నారు. ప్రస్తుతం బౌలింగ్ కోచ్‌గా ఉన్న భరత్ అరుణ్‌ను ప్రధాన కోచ్‌గా నియమించాలని రవిశాస్త్రి కోరుతున్నట్లుగా తెలుస్తోంది.
భరత్ శిక్షణలో భారత బౌలర్లు ఎంతో మెరుగయ్యారని అంటున్నారు. ఐతే బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా మాత్రం గంగూలీని కోచ్‌గా చేయాలని పట్టుబడుతున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాము భారతీయున్ని కోచ్‌గా నియమించే విషయమై ఆలోచిస్తున్నామని దాల్మియా రెండు రోజుల క్రితం చెప్పారు.