పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాక్ జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ తమ స్థానాలపై అభద్రతా భావంతో ఉన్నారని పేర్కొన్నాడు. ఏ ప్లేయర్‌కూ జట్టులో గ్యారెంటీ లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డును నషీమ్ షా విమర్శించాడు.
ఆసియా కప్‌లో గాయపడిన నసీమ్ షా వన్డే వరల్డ్ కప్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలకు కూడా నసీమ్ అందుబాటులో లేడు. ఇటీవల పాకిస్థాన్ సూపర్ లీగ్‌తో తిరిగి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే గాయం తర్వాత తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి నసీమ్ షా మాట్లాడాడు.

''నిజాయతీగా చెప్పాలంటే జట్టులో ప్రధాన ఆటగాళ్లు కూడా విరామం తీసుకోవాలంటే భయపడుతున్నారు. అలసిపోయినప్పటికీ, బ్రేక్ అవసరమైనప్పటికీ తమ శరీరాలకు విశ్రాంతి ఇవ్వట్లేదు. ఎందుకంటే పాకిస్థాన్ క్రికెట్‌లో ఓ సంస్కృతి ఉంది. ఓ యువ ప్లేయర్ జట్టులోకి వచ్చి ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల్లో చక్కని ప్రదర్శన చేస్తే.. బ్రేక్ తీసుకున్న ఆటగాళ్లు జట్టులో తమ స్థానాన్ని శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉంది. ఆ స్థానాలను యువఆటగాళ్లతో భర్తీ చేస్తుంటారు''
''ఈ భయంతో ఆటగాళ్లు విశ్రాంతి కూడా తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఒకవేళ బ్రేక్ తీసుకుంటే కెరీర్ ముగిసిపోతుందేమో అని భయం. కానీ ఇతర దేశాల్లో ఇలా ఉండదు. ఓ ప్రధాన ఆటగాడు ఏదైనా కారణంతో ఆటకు దూరమైనా జట్టులో అతడి స్థానానికి ఢోకా ఉండదు. రెండు మూడు మ్యాచ్‌ల్లో ప్రదర్శన చేసిన ఆటగాడితో అతని స్థానాన్ని భర్తీచేయరు'' అని యువ పేసర్ నసీమ్ షా పేర్కొన్నాడు.
21 ఏళ్ల నసీమ్ షా పాకిస్థాన్ తరఫున 17 టెస్టులు, 14 వన్డేలు, 19 టీ20లు ఆడాడు. 2019లో అరంగేట్రం చేసిన నసీమ్ జట్టులో కీలక పేసర్‌గా ఎదిగాడు. టెస్టుల్లో 51 వికెట్లతో సత్తాచాటాడు. వన్డేల్లో 32, టీ20ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. వన్డే వరల్డ్ కప్‌లో నసీమ్ షాపై ప్రధాన పేసర్‌గా పాకిస్థాన్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆసియాకప్‌లో అతని భుజానికి గాయమైంది.