మొహాలీ: భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ వరుసగా మ్యాచ్‌లలో దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఓటమి కోరల్లో ఉన్న భారత జట్టును కోహ్లీ గెలిపిస్తున్నాడు. దాదాపు కోహ్లీ బాగా ఆడిన ప్రతి మ్యాచ్‌లో భారత్ గెలుస్తోంది. దూకుడైన ఆటతో కోహ్లీ తన పేరిట ఎన్నో రికార్డులు, అవార్డులు లిఖించుకుంటున్నారు.
ఆదివారం నాడు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ప్రదర్శన అద్భుతం. అతని తీరును ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టు, ఆస్ట్రేలియా మీడియా కూడా పొగిడింది. తమ నుంచి కోహ్లీ మ్యాచ్‌ను లాగేసుకున్నాడని ఆసిస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ చెప్పాడు. కోహ్లీ ఆటను ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.
కోహ్లీ ఆట తీరుపై సెహ్వాగ్ మాట్లాడుతూ... సచిన్ తర్వాత క్రికెట్లో కోహ్లీ శకం ప్రారంభమైందని చెప్పాడు. ఆసిస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను మీడియా సచిన్, కోహ్లీను పోలుస్తూ ప్రశ్నించింది. దీనికి స్మిత్ స్పందిస్తూ.. కోహ్లీ, సచిన్ డిఫరెంట్ ఆటగాళ్లని చెప్పాడు. కోహ్లీ పైన ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ మ్యాచ్ విన్నర్ అని చెప్పాడు.
తద్వారా క్రికెట్ అభిమానుల్లో ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డులను కోహ్లీ బద్దలు కొట్టనున్నాడా? అనే చర్చ సాగుతోంది. అదే సమయంలో సచిన్ ఆడిన మ్యాచుల్లో భారత్ చాలా ఓడిందనే వాదన కూడా ఉంది. అదే కోహ్లీ మాత్రం ఆడితే భారత్ గెలుస్తుందని అంటున్నారు.
ఇద్దరికీ పోలిక తేవడం సరికాదనే వాదన ఉన్నప్పటికీ.. కోహ్లీ దూకుడైన ఆటతో సచిన్ రికార్డులను అధిగమిస్తాడా అనే చర్చ మాత్రం సాగుతోంది.
ప్రపంచ కప్ ట్వంటీ 20ల్లో భాగంగా జరుగుతున్న మ్యాచుల్లో.. కోహ్లీ బాగా రాణిస్తున్నాడు. పాక్, ఆసిస్‌తో జరిగిన మ్యాచుల్లో దుమ్ము రేపాడు. సచిన్, కోహ్లీల్లో ఎవరు బెస్ట్ అనే వాదన సరికాదనే చెప్పవచ్చు. క్రికెట్లో సచిన్ సెయింట్ హుడ్ హోదా పొందాడు. కోహ్లీ ఈ తరంవాడు.

కోహ్లీ, టెండుల్కర్‌లలో సారుప్యతలు
సచిన్, కోహ్లీల మధ్య ఎన్నో సారుప్యతలు కనిపిస్తాయి. కోహ్లీ వల్లే ఇప్పుడు టీమిండియా సెమీ ఫైనల్లో అడుగు పెట్టింది. 1990లలో సచిన్ టెండుల్కర్ ఆరంగేట్రం చేసినప్పుడు టీమిండియా అతని పైనే ఆధారపడింది.
ఆ తర్వాత సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, వారి తర్వాత వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ వంటి వారు కూడా వచ్చారు. వీరు కూడా అద్భుతమైన ఆటగాళ్లు. అయితే ప్రత్యర్థులకు మాత్రం సచిన్ టెలండుల్కర్ వికెట్టే టార్గెట్.
ఇప్పుడు ఈ ట్వంటీ 20 కప్‌లోను టీమిండియా కోహ్లీ పైన ఆధారపడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. 1996 ప్రపంచ కప్‌లో సచిన్ రెండు సెంచరీలు చేశాడు. అంతేకాకుండా 90లు ఒకటి, 70లు రెండు, 60 పరుగులు ఒకటి చేశాడు.
24 ఏళ్ల పాటు క్రికెట్ ఆడి రికార్డ్
24 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ ఆడి రికార్డులు సృష్టించాడు. అతనిని సునీల్ గవాస్కర్‌తో పోల్చేవారు. సచిన్ వంద అంతర్జాతీయ సెంచరీలు చేశాడు. గవాస్కర్ కంటే రెండింతలు పరుగులు చేశాడు. సచిన్ ఆట పైన అందరూ జడ్జిమెంట్ చేసేవారు. గవాస్కర్ 35 సెంచరీలు చేశాడు.
గవాస్కర్ టెస్ట్ జీనియస్. టెండుల్కర్ టెస్టులు మరియు వన్డేలలో జీనియస్. కోహ్లీ మాత్రం ట్వంటీ 20ల్లో అద్భుతమైన ఆటగాడు. మిగతా వాటిలోను అద్భుతంగా రాణిస్తున్నాడు. వీరిని ఒకరితో ఒకరిని పోల్చలేదు. కోహ్లీ ఇప్పుడు టీమిండియా టెస్టు కెప్టెన్‌గా ఉన్నాడు. కెప్టెన్సీలో సచిన్ కంటే కోహ్లీ బెటర్‌గా ఉన్నాడని చెప్పవచ్చు.
కోహ్లీ 10 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించి 5 టెస్టుల్లో గెలిపించాడు. సచిన్ టెండుల్కర్ 25 టెస్టులకు కెప్టెన్‌గా ఉండి నాలుగు మాత్రమే గెలిపించాడు.
ట్వంటీ ఛేదనలో కోహ్లీ రికార్డు
విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్‌గా ఉన్నాడు. దీంతో టాప్ క్లాస్ పర్‌ఫార్మర్‌గా ఎదిగే స్కోప్ ఉంది. వన్డే, ట్వంటీ 20ల్లో చాలా ఫాస్టుగా స్కోర్ చేస్తున్నాడు. అద్భుతంగా రాణిస్తున్న కోహ్లీ అందరి అభినందనలను అందుకుంటున్నాడు. నాడు సచిన్ పైన జట్టు ఆధారపడేది. ఇప్పుడు కోహ్లీ పైన ఆధారపడుతోంది. దీంతో ఇరువురిని కొందరు పోల్చుతున్నారు.
టెండుల్కర్, కోహ్లీ.. ఆస్ట్రేలియా పర్యటన
సచిన్ టెండుల్కర్, కోహ్లీ.. ఇరువురు కూడా తమ తొలి ఆస్ట్రేలియా పర్యటనలో రాణించారు. తమ తమ కెరీర్ ఆరంభంలో ఆసిస్ పర్యటనలలో అద్భుతంగా రాణించి ఆత్మవిశ్వాసం సంపాదించుకున్నారు.
సచిన్ టెండుల్కర్ తన రెండో, మూడో టెస్టుల్లో 148 పరుగులు నాటౌట్ (సిడ్నీ), 114 పరుగులు (పెర్త్)లలో అద్భుతంగా రాణించాడు. ఇవి 1991-92లో జరిగిన టెస్టులు. కోహ్లీ అడిలైడ్‌లో 2012లో 116 పరుగులు చేశాడు.
అయితే, భారత్ ఈ రెండు సమయాల్లోని సిరీస్‌ను ఆసిస్‌కు 0-4తో కోల్పోయింది. అయితే, వారు తమ అద్భుతమైన ఆట తీరుతో ఆత్మవిశ్వాసం సంపాదించుకున్నారు. భారత క్రికెట్‌ను టెండుల్కర్ కంటే ముందు, టెండుల్కర్ తర్వాత అని చాలామంది భావిస్తారు.
అయితే, గేమ్ (క్రికెట్) ఎప్పుడూ సాగుతుందని, స్టార్లు వస్తారని విరాట్ కోహ్లీ ద్వారా నిరూపితమైంది. కోహ్లీ దూకుడు చూస్తుంటే సచిన్ రికార్డులు బద్దలు కొట్టవచ్చునని అతని అభిమానులు భావించవచ్చు. కానీ సచిన్‌లా వంద సెంచరీలు చేయడం కష్టమే. సచిన్, కోహ్లీల్లో ఎవరికీ వారే గొప్ప. ఒకరిని మరొకరితే పోల్చలేము.