మెల్బోర్న్: ప్రపంచ కప్ పోటీ సందర్భంగా కోచ్ డంకెన్ ఫ్లెచర్‌ను పక్కన పెట్టి టీమ్ డైరెక్టర్ రవిశాస్త్రియే అంతా తానై నడిపిస్తున్నాడంటూ మీడియాలో వచ్చిన వార్తలపై బిసిసిఐ మండిపడింది. సమావేశాల్లో ఫ్లెచర్ ఉండడం లేదని, జట్టు వ్యూహరచనలకు కూడా ఆయనను దూరం పెట్టారంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలను బిసిసిఐ బుధవారంనాడు ఖండించింది.
రవిశాస్త్రి హోటల్లో అతి ముఖ్యమైన సమావేశం ఏర్పాటు చేశారని, ఈ సమావేశానికి ఫ్లెచర్‌ను దూరంగా ఉంచారని వార్తలు వచ్చాయి. అటువంటి సమావేశం ఏదీ జరగలేదని, డంకెన్ ఫ్లెచర్‌ను దూరం పెట్టారనే వార్తల్లో నిజం లేదని, డంకెన్ ఫ్లెచర్‌ను సపోర్ట్ స్టాఫ్ సమావేశానికి దూరంగా ఉంచారనేది ఊహాజనితమైన వార్త మాత్రమేనని జట్టు మీడియా మేనేజర్డీఆర్ ఆర్ఎన్ బాబు చెప్పారు.

ఫ్లెచర్ లేకుండా ఏర్పాటు చేసినట్లు చెబుతున్న సపోర్ట్ స్టాఫ్ సమావేశం జరిగినప్పుడు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ సాయంత్రం పూట తమ మిత్రుడిని కలవడానికి వెళ్లారని అంటున్నారు. ఫ్లెచర్‌ను దూరం పెట్టారని భావిస్తున్నారా, దూరం పెట్టారని అనడం పూర్తిగా బాల్యచేష్ట మాత్రమేనని బిసిసిఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
ప్రపంచ కప్ ముగిసే వరకు ఫ్లెచర్ కాంట్రాక్టు ఉందని, అందుకు నెలన్నర వ్యవధి ఉదని, ఆయన పొడగింపు అడుగుతారని అనుకోవడం లేదని, ప్రపంచ కప్ ముగిసిన తర్వాత వెళ్లిపోయే వ్యక్తి పట్ల అలాంటి వ్యవహారం జరుగుతుందని అనుకుంటారా అని ఆయన అన్నారు.