బెంగళూరు: ప్రపంచ క్రికెట్ పైన పిలిప్ హ్యూస్ మృతి ప్రభావం ఇంకా కనిపిస్తోంది. శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కర, ఐర్లాండ్ క్రికెటర్ మూన్‌లు మ్యాచ్‌ల సమయంలో ప్రత్యేక నెక్ వియర్ పెట్టుకున్నారు. యంగ్ ఆస్ట్రేలియా క్రికెటర్ పిలిప్ హ్యూస్ గత ఏడాది నవంబర్ నెలలో సిడ్నీలో బంతి తగిలి చనిపోయిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత పలువురు క్రికెటర్లు పిలిప్ హ్యూస్ ఉదంతం చెప్పి భయానికి లోనైన సందర్భాలున్నాయి. తాజా ప్రపంచ కప్‌లో ఐరిష్ బౌలర్ మూనీ, శ్రీలంక బ్యాట్స్‌మెన్ సంగక్కరలు మెడ వద్ద ప్రత్యేక భద్రత కోసం హెల్మెట్‌తో పాటు పెట్టుకున్నట్లుగా కనిపించారు.
ఆదివారం నాడు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో సంగక్కర సెంచరీ చేశాడు. ఈ సమయంలో సంగక్కర మెడ వద్ద హెల్మెట్‌తో పాటు ప్రత్యేక వియర్ కనిపించింది. ప్రస్తుతం క్రికెటర్లు అదనపు రక్షణ కలిగిన హెల్మెట్‌ల కోసం చూస్తున్నారు. మూనీ.. స్వయంగా తాను తయారు చేసిన ఓ ప్రత్యేక రక్షణ కవచాన్ని హెల్మెట్‌కు జోడించాడు.

దీనిని మూనీ మామ తయారు చేశాడు. ఈ విషయమై మూనీ మాట్లాడుతూ.. తన మామ ఆర్కిటెక్ అని, తామిద్దరం కలిసి దీనిని డిజైన్ చేశామని చెప్పాడు. మెడ వెనుక భాగాన్ని రక్షించేందుకు ప్రత్యేక వస్తువును (గోర్జెట్) హెల్మెట్‌కు అటాచ్ చేశారు.
ప్రస్తుతం ఈ గోర్జెట్‌ను మూనీ ఒక్కడే ఉపయోగిస్తున్నాడు. ఇది రక్షణ కోసం బాగుంటుందని క్రికెటర్లు భావిస్తే... దీనిని మార్కెట్ చేస్తారని చెప్పవచ్చు. సంగక్కర బ్యాక్ ప్యానెల్ మార్పులు చేసిన హెల్మెట్ పెట్టుకున్నారు. హ్యూస్ ట్రాజెడీ నేపథ్యంలో రక్షణ కోసం హెల్మెట్లలో మార్పులు జరుగుతున్నాయి.