మెల్బోర్న్: ఐసిసి ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా రేపు ఆదివారం దక్షిణాఫ్రికా, భారత్ మధ్య జరిగే మ్యాచ్ అత్యంత ఆసక్తికరంగా సాగనుంది. భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన గ్యారీ కిర్‌స్టన్ దక్షిణాఫ్రికాకు రహస్య ఆయుధంగా మారాడని అంటున్నారు. భారత జట్టులోని ప్రతి ఒక్కరి ఆయుపుపట్లు తెలిసిన ఆయన దక్షిణాఫ్రికా జట్టుకు తగిన సమాచారం ఇస్తున్నట్లు చెబుతున్నారు. భారత జట్టులోని ఆటగాళ్ల లోటుపాట్లను ఆయన వివరించి దక్షిణాఫ్రికాను గెలిపించాలనే పట్టుదలతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.
కాగా, సచిన్ టెండూల్కర్ భారత జట్టులో ఉత్సాహాన్ని నింపనున్నారు. మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో భారత్ బలమైన డీవిలియర్స్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికాను ఎదుర్కునే సమయంలో సచిన్ టెండూల్కర్ భారత జట్టు ఆత్మస్థయిరాన్ని పెంచే పనికి పూనుకుంటున్నాడు.

సచిన్ టెండూల్కర్ స్టాండ్స్ నుంచి భారత జట్టుకు చీర్స్ చెబుతూ ఉత్సాహపరుస్తాడని టెలివిజన్ చానెల్స్ వార్తాకథనాలను ప్రసారం చేశాయి. ఆరు ప్రపంచ కప్ పోటీల్లో పాల్గొన్న సచిన్ టెండూల్కర్ మొదటి సారి మైదానం వెలుపలి నుంచి తన పాత్ర పోషించడానికి సిద్ధపడ్డాడు. పాకిస్తాన్‌పై గెలిచిన ఆత్మవిశ్వాసంతో భారత్ దక్షిణాఫ్రికాను ఎదుర్కోవడానికి సిద్ధపడింది.
ఇరు జట్లు కూడా నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేసి, రేపటి మ్యాచును గెలవాలనే పట్టుదలతో ఉన్నాయి. భారత్ ఎక్కువగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ బలంపై, అశ్విన్ స్పిన్ మంత్రంపై ఆధారపడింది. అయితే, దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టెయిన్ భారత బ్యాట్స్‌మెన్ పట్ల ప్రమాదకారిగా మారే అవకాశం ఉన్నట్లు సచిన్ సహా భారత మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు. విరాట్ కోహ్లీ బ్యాటింగుకు, స్టెయిన్ బౌలింగుకు మధ్య పోరుగా కూడా రేపటి మ్యాచును అభివర్ణిస్తున్నారు.