
హైదరాబాద్: టీ20 క్రికెట్‌లో ఒక్క బంతి మ్యాచ్ గమనాన్నే మార్చివేస్తుంది. తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో సరిగ్గా ఇలానే జరిగింది. బుధవారం మెల్‌బోర్న్ రెనిగేడ్స్, సిడ్నీ సిక్సర్స్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ చివరకు 'సూపర్ ఓవర్' వరకు వెళ్లింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. అనంతరం 121 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్ జట్టు 19.5 ఓవర్లు ముగిసే సమయానికి 118/7తో నిలవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.
ఇందుకు సంబంధించిన వీడియోని డబ్ల్యూబీబీఎల్ తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. ఇందులో సిడ్నీ జట్టు విజయానికి చివరి బంతికి మూడు పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో ఉన్న బ్యాట్స్ ఉమెన్ అలై మెల్‌బోర్న్ బౌలర్ ఆఖరి బంతిని.. యార్కర్ రూపంలో విసరగా.. దానిని షాట్‌గా కనెక్ట్ చేయడంలో అలై విఫలమైంది.
బంతి ఫైన్‌లెగ్ దిశగా వెళ్లడంతో ఒక పరుగు పూర్తి చేశారు. అప్పటికే తమ జట్టు గెలిచిందనకుని మెల్‌బోర్న్ వికెట్ కీపర్ ఎమ్మా ఇంగ్లీష్ తన చేతికి ఫీల్డర్ ఇచ్చిన బంతిని గాల్లోకి సంతోషంతో ఎగురవేసి సంబరాలు చేసుకుంది. అయితే బంతి డెడ్ అవలేదనే లాజిక్‌ని కనిపెట్టిన సిడ్నీ జట్టు బ్యాట్స్ ఉమెన్ గ్యాప్‌లో రెండో పరుగు కోసం పరుగెత్తింది.
దీంతో ఆశ్చర్యపోయిన మెల్‌బోర్న్ ఫీల్డర్ ఒకరు బంతిని అందుకుని వికెట్లకి కొట్టేందుకు ప్రయత్నించినా అప్పటికే సిడ్నీ బ్యాట్స్ ఉమెన్ క్రీజులోకి వచ్చేసింది. దీంతో రెండో పరుగు పూర్తి చేసిన సిడ్నీ చివరికి 120/7తో స్కోరు బోర్డుని సమం చేసింది.
మరోవైపు బంతిని అంపైర్ డెడ్‌గా ప్రకటించకముందే సంబరాలు చేసుకున్న మెల్‌బోర్న్ జట్టు సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. అయితే.. సూపర్ ఓవర్‌లో సిడ్నీ జట్టు 9 పరుగుల లక్ష్యాన్ని మెల్‌బోర్న్ జట్టుకి నిర్దేశించగా.. ఆ జట్టు అలవోకగా ఛేదించి విజయం సాధించింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.