
హైదరాబాద్: స్వయంగా సచిన్‌యే తనకు అభిమాని అయిన లతా మంగేశ్కర్‌తో కలిసి ఐపీఎల్ 2018 ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించినట్లు సచిన్ వెల్లడించాడు. ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన ఈ పోరులో చెన్నై గెలుపొందింది. ఉత్కంఠభరితమైన ఈ మ్యాచ్‌ను సచిన్ లతా మంగేశ్కర్ స్వగృహం నుంచి చూశాడట.
ఐపీఎల్‌లో గతంలో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సచిన్ ఇప్పుడు ఆ జట్టు మెంటార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. గతేడాది విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ ఏడాది ప్లేఆఫ్‌కు కూడా చేరుకోలేకపోయింది. ఆదివారం చెన్నై సూపర్‌కింగ్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఫైనల్ పోరు జరిగింది.
ఇందులో చెన్నై విజయం సాధించి మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఈ మ్యాచ్‌ను సచిన్ మంగేశ్కర్ గారితో కలిసి చూసినట్లు ట్విటర్ ద్వారా అభిమానులకు తెలిపాడు. 'లతా మంగేష్కర్ దీదీతో కలిసి ఫైనల్ చూశాను. దీంతో ఈ ఫైనల్ చాలా స్పెషల్ అయ్యింది' అని పేర్కొన్నాడు. లతా మంగేష్కర్, భార్య అంజలితో కలిసి ఉన్న ఫొటోను సచిన్ ట్విటర్ ద్వారా పంచుకున్నాడు.
లతా మంగేష్కర్‌కు సచిన్ వీరాభిమాని. గతంలోనూ ఎన్నోసార్లు సచిన్ ఆమెపై అభిమానాన్ని చాటాడు. ఆమె పాటలు ఎక్కువగా వింటానని పలు సందర్భాల్లో చెప్పాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే లీగ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన చెన్నై, హైదరాబాద్ ఫైనల్‌కు చేరుకున్నాయి. బౌలింగే ప్రధాన బలంగా కొనసాగిన హైదరాబాద్ ఫైనల్‌లో మాత్రం ఆ సత్తా చాటలేకపోయింది. దీంతో సూపర్ కింగ్స్‌కు అడ్డు లేకుండాపోయింది. షేన్ వాట్సన్ అదిరిపోయే ఇన్నింగ్స్‌తో చేధనకు దిగిన చెన్నై 8వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.