హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు పరిచయం అక్కర్లేని పేరు యువరాజ్ సింగ్. ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు బాదిన క్రికెటర్. క్రీజులో ఉన్నంత సేపు అభిమానులకు పండగే... ప్రత్యర్థి జట్టు బౌలర్లకు హడలే.. ఏ బాల్ ఎటు పోతుందో తెలియదు కానీ.. స్టాండ్స్‌లోకి వెళ్లడం మాత్రం ఖాయం.
అలాంటి యువరాజ్ తన జీవితంలో చోటుచేసుకున్న ఒక ఘటనను తలుచుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'కౌన్‌బనేగా కరోడ్‌పతి' షోలో యువరాజ్ సింగ్, బాలీవుడ్ నటి విద్యాబాలన్ పాల్గొన్నారు. ఈ షోలో తన జీవితంలో చోటుచేసుకున్న పరిణామాల గురించి యువీ వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు.

భయానక క్యాన్సర్ వ్యాధి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. కేన్సర్ కారణంగా తన ఆరోగ్యం ఎంతగా క్షీణించిందో తెలిపాడు. ఒకానొక దశలో క్రికెట్‌ను వదిలేయాలని, లేకుంటే ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్ చెప్పారని యువీ తెలిపాడు.
'ఒక రోజు ఉదయం నిద్రలేచిన వెంటనే ఎర్ర రంగులో తెమడ బయటికి వచ్చింది. అయినప్పటికీ నేను నా ఆటను కొనసాగించా. రోజురోజుకీ నా ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఇక నువ్వు ఆట మానేసి ట్రీట్‌మెంట్ తీసుకోకపోతే ఎక్కువ కాలం బతికి ఉండలేవు' అని వైద్యులు చెప్పారు. ఈ విషయం చెబుతూ యువీ కన్నీటి పర్యంతమయ్యాడు.
సరైన చికిత్స తీసుకోకపోతే.. తాను ఇప్పుడు బ్రతికి ఉండేవాడిని కాదంటూ యువీ కన్నీరు పెట్టుకున్నాడు. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉద్విగ్నభరితంగా మారిపోయింది. పక్కనే ఉన్న విద్యాబాలన్ యువీని ఓదార్చింది. క్యాన్సర్ వ్యాధి నుంచి యువీ కోలుకుని ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన సంగతి తెలిసిందే.
