హైదరాబాద్: సచిన్ టెండూల్కర్..... అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ పేరుకి ఉన్న విశిష్టతను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్‌లో ఎన్ని రికార్డులైతే ఉన్నాయో అన్ని రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
భారత క్రికెట్ అభిమానులు ముద్దుగా 'క్రికెట్ గాడ్' పిలుచుకునే సచిన్ టెండూల్కర్‌ను తొలిసారి టీవీలో ఇంటర్వ్యూ చేసిందెవరో తెలుసా? బాలీవుడ్ నటుడు అయిన టామ్ ఆల్టర్. చర్మ కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన శుక్రవారం రోజు కన్నుమూశారు.
ఈ సందర్భంగా ఆయన సచిన్ టెండూల్కర్‌ని చేసిన ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 1980-90ల్లో స్పోర్ట్స్ జర్నలిస్టుగా పనిచేసిన ఆయన ఓ టీవీ ఛానల్ కోసం సచిన్ టెండూల్కర్‌ను ఇంటర్వ్యూ చేశారు.
అలా సచిన్‌ను ఇంటర్యూ చేసిన మొదటి వ్యక్తిగా టామ్ ఆల్టర్ నిలిచారు. అప్పుడు సచిన్‌కి 15 ఏళ్లు. ఇంకా భారత్ తరఫున ఆడలేదు. గుజరాత్ జట్టుతో జరిగిన రంజీ మ్యాచ్‌లో ముంబై జట్టు తరఫున ఆడిన సచిన్ టెండూల్కర్ సెంచరీతో మెరిశాడు.
దీంతో ఆ తర్వాత వెస్టిండీస్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో ఆడటానికి సచిన్‌కు భారత జట్టులో చోటు కల్పించాలని క్రికెట్ పెద్దలు నిర్ణయించారు. ఆ సమయంలో టామ్ ఈ ఇంటర్వ్యూ చేశారు. ఆయన మరణానికి సంతాపంగా చాలా మంది క్రికెటర్లు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.