కింగ్‌స్టన్: టీమిండియా స్టార్ ఆటగాడు, టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఆట తీరుతో ఎందరికో స్ఫూర్తినిస్తున్నాడు. అంతేగాక, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇండియాలోనే గాక ప్రపంచ వ్యాప్తంగా కోహ్లీకి అభిమానులు పెరిగిపోతుండటం విశేషం. దయాది దేశం పాకిస్థాన్‌లో కూడా కోహ్లీకి అభిమానులుండటం గమనార్హం.
ఇటీవల పాకిస్థాన్‌కు చెందిన ఓ వీరాభిమాని కోహ్లిపై ప్రేమను చాటుతూ తన ఇంటిపై భారత్ జెండా ఎగురవేసి చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా మరో పాకిస్థాన్ యువకుడు కోహ్లీ వీరాభిమానుల జాబితాలో చేరిపోయాడు.
ప్రస్తుతం భారత్, వెస్టిండీస్ టెస్టు సిరీస్‌లో అంపైర్‌గా పనిచేస్తున్న ఐసీసీ ఎలైట్ ప్యానల్ అంపైర్ అలీందార్ కుమారుడు హసన్.. కోహ్లీపై తన అభిమానాన్ని చాటుతూ ఓ వీడియో సందేశాన్ని పంపి ఆశ్చర్యపరిచాడట.
తొలి టెస్టు అనంతరం ఈ అభిమాని గురించి తెలుసుకున్న విరాట్ కోహ్లీ స్వయంగా ఓ వీడియో సందేశాన్ని హసన్‌కు పంపించాడు. అందులో తాను స్వయంగా సంతకం చేసిన బ్యాట్‌ను కూడా త్వరలో బహుమతిగా పంపనున్నట్లు వాగ్దానం కూడా చేశాడు.
ఈ ఏడాది ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో పాక్ పేసర్ మహ్మద్ అమీర్‌కు విరాట్ కోహ్లీ ఓ బ్యాట్‌ను బహుమతిగా అందజేసిన విషయం తెలిసిందే. కాగా, కోహ్లీ.. పాక్ అభిమాని పట్ల చూపిన శ్రద్ధ పలువురిని ఆకట్టుకుంది. దీంతో కోహ్లీపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.