న్యూఢిల్లీ: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ హిందీ ఛానల్‌కు లైవ్ షోలో క్రికెట్ విశ్లేషణ చేస్తున్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తి కెమెరాలను లాగేశాడు. ఆసీస్‌పై విరాట్ కోహ్లీ రాణించిన తీరు పట్ల ఆజ్‌తక్ ఛానల్‌తో వసీం అక్రమ్ విశ్లేషిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ముంబై నుంచి వీడియో లింక్ ద్వారా ఆ కార్యక్రమం సాగుతోంది. అకస్మాత్తుగా ఓ గుర్తు తెలియన వ్యక్తి వచ్చి అక్కడున్న కెమెరాను తొలిగించాడు. దీంతో వసీం అక్రమ్ కొంత ఆందోళనకు గురయ్యాడు. సీటు నుంచి లేచి వసీం బయటకు వెళ్లాల్సి వచ్చింది. కెమెరా సిబ్బందితోనూ ఆ వ్యక్తి దురుసుగా ప్రవర్తించాడు.
టీవీలో ఆ ప్రొగ్రామ్‌ను లైవ్‌లో ప్రజెంట్ చేస్తున్న యాంకర్ విక్రమ్ గుప్తా ఆ ఘటనను చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. అయితే వసీంకు ఎటువంటి ప్రమాదం జరగలేదని ఆ ఛానల్ తన ట్విట్టర్ ద్వారా పేర్కొంది.
ఓ వ్యక్తి తాగిన మత్తులో కెమెరాలో కనిపించేందుకు అలా ప్రవర్తించాడని ట్వీట్ చేశారు. అయితే ఆ సదురు వ్యక్తి స్టూడియోలోకి ఎలా వచ్చాడో ఎవరూ స్పష్టం చేయలేదు. కాగా, పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు మాత్రం ఆ ఘటన పట్ల తమ నిరసన వ్యక్తం చేశారు. జరిగిన విషయం ఏంటో తెలపాలని వసీం అక్రమ్‌ను కోరారు.