
హైదరాబాద్: చెన్నై జట్టు ఆటగాళ్లే కాదు, వారి చిన్నారులు కూడా దాదాపు అదే పనిలో ఉన్నారు. ఈ విషయాన్ని రైనానే స్యయంగా చెప్పాడు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తోన్న ఆ ముగ్గురు ఆడుకుంటూ ఉన్న వీడియోను రైనా తన ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ధోనీ కూతరు జీవాతో కలిసి రైనా, హర్భజన్ సింగ్‌ల ఇద్దరి కూతుళ్లు గ్రేసియా, హినాయా కలిసి సరదాగా గడిపేస్తున్నారు.
దాంతో పాటుగా జీవా, గ్రేసియా ఇద్దరూ ట్యాబ్ లలో ఆడుకుంటున్న ఫొటో ఒకటి పోస్టు చేసి వాళ్లిద్దరూ గత రాత్రి జరిగిన మ్యాచ్ హైలెట్స్ చూస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు. రింగ రింగా రోసెస్.. అంటూ ముద్దుగా అడుకుంటున్న వీరు చాలా ఎంజాయ్ చేశారని రైనా ట్విటర్‌లో పేర్కొన్నాడు.
శనివారం జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ 11లో ఒక అద్భుతమే జరిగిందని చెప్పాలి. వరుస ఓటములతో కుప్పకూలిన ముంబై ఇండియన్స్ అనూహ్యమైన రీతిలో చెన్నై జట్టుపై విజయం సాధించి అరుదైన ఘనత సాధించుకుంది.
మొదట బౌలింగ్ షోతో పటిష్టమైన చెన్నైని కట్టడి చేయడంతో పాటు లక్ష్య ఛేదనలో రోహిత్ 33 బంతుల్లో (56) (6 ఫోర్లు, 2 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ముంబైని గెలుపు బాట పట్టించాడు. టాప్ ఆర్డర్‌లో మరో ఇద్దరు కూడా బ్యాట్లు అడ్డేయడంతో భారీ లక్ష్యాన్ని ఎలాంటి ఇబ్బందిలేకుండా ఛేదించేసింది. మరోవైపు చెన్నైలో రైనా ఒంటరిపోరాటం చేసినా, తెలుగుతేజం రాయుడు మరోసారి రఫ్పాడించినా.. పేలవ బౌలింగ్‌తో ధోనీసేన వికెట్ల వేటలో వెనుకబడింది.
రైనా జోరు:
రాయుడు, రైనా చెరో సిక్సర్ బాదడంతో 15 పరుగులు వచ్చాయి. తర్వాతి ఓవర్‌లో రాయుడు మరో సిక్స్, ఫోర్ కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ధోనీసేన 51/1 స్కోరు చేసింది. బౌలింగ్ ఛేంజ్‌లో భాగంగా వచ్చిన మార్కండే తొలి ఓవర్‌లో 3 పరుగులే ఇచ్చినా.. తర్వాతి ఓవర్‌లో రైనా 6, 4తో 14 పరుగులు పిండుకున్నాడు. అవతలివైపు కటింగ్ కూడా 14 పరుగులు ఇచ్చుకోవడంతో రోహిత్ వెంటనే బౌలింగ్‌లో మార్పులు చేపట్టాడు.