
హైదరాబాద్: షోయబ్ అక్తర్.... భారత క్రికెట్ అభిమానులకు ఈ పేరు బాగా సుపరిచితం. రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన షోయబ్ అక్తర్ మళ్లీ క్రికెట్‌లోకి అడుగుపెట్టనున్నాడు. ఫిబ్రవరి14న మళ్లీ మైదానంలోకి వస్తున్నట్లు ఆయన ట్విటర్ వేదికగా బుధవారం ప్రకటించాడు. ఈ మేరకు ఓ వీడియోని తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.
"ఈరోజుల్లో పిల్లలు తమకు క్రికెట్ గురించి చాలా విషయాలు తెలుసనుకుంటారు. అంతేకాదు నా ఫాస్ట్ బౌలింగ్‌ను సవాల్ కూడా చేయగలరు. కాబట్టి నేను మళ్లీ బంతి పట్టుకుంటున్నాను. అసలైన బౌలింగ్ వేగం అంటే ఏంటో వారికి నేను చూపిస్తాను" అని ఆ వీడియోలో అక్తర్ పేర్కొన్నాడు. అంతేకాదు షోయబ్ ఈజ్ బ్యాక్ అనే ట్యాగ్ కూడా పెట్టాడు.
ఫిబ్రవరి 14న పాకిస్థాన్ సూపర్ లీగ్ నాలుగో సీజన్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా షోయబ్ తిరిగి క్రికెట్‌లోకి రావటం పట్ల మాజీ క్రికెటర్ వసీం అక్రమ్, షోయబ్ మాలిక్‌లు స్పందించారు. ఈవార్త నిజమేనా అంటూ వసీం అక్రమ్ ట్వీట్ చేశారు. సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ కూడా తనదైన శైలిలో అక్తర్ ట్వీట్‌కు స్పందించాడు.