
హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తన కుమారుడు జోరావర్ ధావన్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే క్రికెటర్లలో శిఖర్ ధావన్ ఒకడు. వరుస సిరీస్‌ల కారణంగా శిఖర్ ధావన్ తన కుటుంబంతో గడిపేందుకు సమయం దొరకలేదు.
నిదాహాస్ ట్రోఫీ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాలో ఉన్న తన భార్య, పిల్లల్ని చూడటానికి వెళ్లాడు. అయితే తాను వస్తున్నట్లు పిల్లలకు చెప్పకుండా వెళ్లి సర్‌ప్రైజ్ చేశాడు. ధావన్‌ని చూసిన పిల్లలు ఆనందంతో గెంతులేశారు. ఈ వీడియోను ధావనే తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు.
ఆస్ట్రేలియాతో ధావన్ కుమారుడు జోరావర్ ప్రి ప్రిపరేటరీ స్కూల్లో చదువుతున్నాడు. తొలుత కుమారుడి వద్దకు వెళ్లిన ధావన్ అతడి కళ్లు మూసి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత తన తండ్రిని చూసిన ఆనందంలో జొరావర్.. ధావన్‌ను గట్టిగా హత్తుకున్నాడు.
ఆ తర్వాత కారులో ఉన్న తన ఇద్దరు కుమార్తెలను ధావన్ సర్‌ప్రైజ్ చేశాడు. పిల్లల నుంచి ఈ రియాక్షన్ కోసమే 15 గంటల పాటు ప్రయాణించి వాళ్లను సర్‌ప్రైజ్ చేశానంటూ ధావన్ ట్వీట్ చేశాడు. 'నా పిల్లలకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు 15 గంటలు ప్రయాణం చేశారు. నన్ను చూసి వాళ్ల స్పందన వెలకట్టలేనిది. నా కుటుంబంతో కలిసి ఈ వారం మొత్తం ఉండబోతున్నా' అని అందులో పేర్కొన్నాడు.
కాగా, త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2018 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ధావన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. దీంతో వచ్చే వారం తిరిగి ఇండియాకు రానున్నాడు. ఏప్రిల్ 7 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
తొలి మ్యాచ్‌లో భాగంగా డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 7న ముంబైలోని వాంఖడె మైదానంలో జరగనుంది.