క్యాచ్ మిస్: రషీద్ ఖాన్‌ని అవహేళన చేసిన అఫ్రిది (వీడియో)

హైదరాబాద్: బౌండరీ లైన్ వద్ద క్యాచ్ మిస్ చేసినందుకు గాను ఆప్ఘనిస్థాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది అవహేళన చేశాడు. అఫ్రిది ఏంటీ... రషీద్ ఖాన్‌ను హేళన చేయడం ఏంటని అనుకుంటున్నారా? వరల్డ్ ఎలెవన్, వెస్టిండిస్ జట్ల మధ్య జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
గురువారం లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా వెస్టిండీస్, వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య టీ20 ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో షాహిద్ అఫ్రిది వేసిన ఓవర్‌లో వెస్టిండిస్ బ్యాట్స్‌మన్ లెగ్ సైడ్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అదే సమయంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తోన్న రషీద్ ఖాన్ ఆ క్యాచ్‌ని అందుకోవడంలో విఫలమయ్యాడు.
అఫ్రిది బౌలింగ్‌లో రషీద్ ఖాన్ క్యాచ్ మిస్
దీంతో నాలుగు పరుగులు వచ్చాయి. అనంతరం రషీద్ ఖాన్‌ని ఉద్దేశించి షాహిద్ అఫ్రిది చేతులు ఊపుతూ హేళన చేశాడు. అయితే రషీద్ ఖాన్ ఈ క్యాచ్ పట్టకపోవడానికి కారణం ఉంది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తోన్న రషీద్ కాన్ కళ్లలోకి ఏదో వెలుతురు పడినట్లు అనిపించడంతోనే అతడి క్యాచ్ అందుకోలేకపోయాడు. ఇదే విషయాన్ని కామెంటేటర్లు సైతం వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిజానికి రషీద్ ఖాన్ అద్భుతమైన ఫీల్డర్. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 11వ సీజన్‌లో రషీద్ ఖాన్ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే.

4 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసి 48 పరుగులిచ్చిన రషీద్ ఖాన్
కోల్‌కతాతో జరిగిన రెండో క్వాలిఫయిర్ మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన క్యాచ్ పట్టి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుని ఐపీఎల్ ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. కాగా, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో వెస్టిండిస్‌తో మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన రషీద్ ఖాన్ 2 వికెట్లు తీసి 48 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఎవిన్ లూయిస్(58), శామ్యూల్స్(43), రామ్‌దిన్(44) రాణించారు.

వరల్డ్ ఎలెవన్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ
అనంతరం 200 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వరల్డ్ ఎలెవన్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 8 పరుగులకే టాప్ ఆర్డర్‌లోని నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్(0), సామ్ బిల్లింగ్స్(4), రషీద్ ఖాన్(9) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరడంతో 16.4 ఓవర్లలో ఎలెవన్ 127 పరుగులకే కుప్పకూలింది. ఎవిన్ లూయిస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

20వేల డాలర్లను విరాళం ప్రకటించిన అఫ్రిది
తుపాను బాధితులకు 20వేల డాలర్లను విరాళంగా అందజేస్తున్నట్లు మ్యాచ్ అనంతరం అఫ్రిది ట్విటర్ ద్వారా ప్రకటించాడు. ఈ మ్యాచ్ ద్వారా వచ్చే నిధులను వెస్టిండీస్‌లోని క్రికెట్ మైదానాల పునరుద్ధరణ పనులకు ఉపయోగించనున్నారు. గతేడాది ఇర్మా తుఫాను వల్ల కరేబియన్ దీవుల్లోని ఐదు క్రికెట్ మైదానాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటిని పునరుద్ధరించేందుకు అవసరమైన నిధులను సేకరించేందుకు ఈ మ్యాచ్‌ని ఐసీసీ అధికారికంగా నిర్వహించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications