షార్జా: వెస్టిండిస్‌తో షార్జాలో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ క్రికెటర్ మహమ్మద్ అమీర్ టెస్టుల్లో తొలి క్యాచ్‌ను అందుకున్నాడు. తన కెరీర్‌లో 20వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న అమీర్ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి ఏడేళ్లవుతుంది.
ఇప్పటి వరకు ఒక్క క్యాచ్ కూడా అందుకోలేదు. అయితే షార్జా క్రికెట్ స్టేడియంలో వెస్టిండిస్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో అమీర్ అందుకున్న తొలి క్యాచ్‌లోనే అద్భుతం చేశాడు. పాక్ బౌలర్ జుల్ఫికర్ బౌలింగ్‌లో వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ డారెన్ బ్రావో షాట్ కొట్టాడు.

ఇంతలో సర్కిల్ లోపల ఫీల్డింగ్ చేస్తున్న అమీర్ అమాంతం గాల్లోకి ఎగిరి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. అమీర్ బంతిని అందుకున్న సమయంలో అతడు పూర్తిగా గాల్లోనే ఉన్నాడు. ఈ అద్భుతాన్ని దృశ్యాన్ని మైదానంలో ఉన్న ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లు క్లిక్ మనిపించారు.
2010 ఇంగ్లాండ్‌లో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో దోషిగా తేలిన ముగ్గురు క్రికెటర్లు సల్మాన్ బట్, మహ్మద్ ఆసిఫ్‌లతో పాటు మహమ్మద్ అమీర్ ఒకడిగా ఉన్నాడు. స్ఫాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రుజువు కావడంతో ఈ ముగ్గురిపై ఐదేళ్లు నిషేధం విధించారు.
అయితే ఈ ఏడాది జనవరిలో మహమ్మద్ అమీర్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేశాడు. తాజాగా షార్జాలో పాకిస్థాన్, వెస్టిండిస్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలి క్యాచ్ అందుకున్నాడు. దీంతో టెస్టు క్రికెట్లో ఇంత ఆలస్యంగా తొలి క్యాచ్ అందుకున్న క్రికెటర్‌గా అమీర్ రికార్డు సృష్టించాడు.