

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ మ్యాచ్‌లో ధోని (35 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), జాదవ్ (34 బంతుల్లో 27; 2 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 54 బంతుల్లో 48 పరుగులు జోడించి జట్టుని గెలిపించాడు. ధోనితో పాటు జట్టుకు సహకారం అందించిన కేదర్ జాదవ్ 148 పరుగుల చేధనలో కీలకంగా వ్యవహారించాడు.
మంగళవారం కేదార్ జాదవ్ పుట్టినరోజు కావడంతో మ్యాచ్ అనంతరం ధోని జట్టంతా డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాలు చేసుకున్నారు. కేదార్ జాదవ్‌తో కేక్ కట్ చేయించి ముఖమంతా పులిమేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.
మంగళవారం నాటి మ్యాచ్‌లో పిచ్ అంతగా సహకరించకపోయినా చేధనలో మాత్రం ఏ తడబాటుకు లోనుకాకుండా చెన్నై అద్భుతంగా ఆడింది. టోర్నీలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తన తదుపరి మ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది. మార్చి 31న జరిగే ఈ మ్యాచ్‌కి చెన్నైలోని చిదంబరం స్టేడియం ఆతిథ్యమిస్తోంది.