హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ వికెట్ కీపర్ తానేనని మరోసారి నిరూపించుకున్నాడు. ఇటీవలే వన్డేల్లో 100 స్టంపింగ్స్ చేసిన వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించిన ధోని... ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన రెండో వన్డేలో కళ్లు చెదిరే స్టంపింగ్ చేశాడు.
ఈ స్టంపింగ్ ఎంతో కీలకమైన మ్యాక్స్‌వెల్ వికెట్ కావడంతో మ్యాచ్‌నే మలుపు తిప్పింది. వికెట్ల వెనుక మెరుపు వేగంతో కదిలే ధోని మరోసారి తన మ్యాజిక్‌ను చూపించాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన మాక్స్‌వెల్ క్రీజులోకి రాగానే.. స్పిన్నర్లని లక్ష్యంగా చేసుకుని పరుగుల వరద పారిస్తున్నాడు.

తాను ఎదుర్కొన్న తొలి ఓవర్‌లోనే చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. ఈ సమయంలో ధోనితో చర్చించిన కోహ్లీ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్‌ని బౌలింగ్‌కు దింపాడు. తొలుత ఆఫ్ స్టంప్‌కి దూరంగా బంతులేస్తూ వచ్చిన.. చాహల్ బౌలింగ్‌లో సింగిల్స్ కోసం ప్రయత్నించాడు.
దీనిని గమనించి ధోని ఎక్కువ టర్న్ చేయాల్సిందిగా చాహల్‌కి సైగల ద్వారా సూచించాడు. ఇన్నింగ్స్ 23వ ఓవర్‌లో చాహల్ విసిరిన బంతిని క్రీజు వెలుపలికి వెళ్లి ఆడేందుకు మాక్స్‌వెల్ యత్నించాడు. అయితే.. బంతి టర్న్ తీసుకుని మాక్స్‌వెల్ వెనక్కి లెగ్‌సైడ్ వైడ్ రూపంలో వెళ్లింది.
అప్పటికే బంతి గమనాన్ని పసిగట్టిన ధోనీ.. వేగంగా బంతి అందుకుని క్షణాల్లో పక్కకు ఒరిగి వికెట్లను గిరాటేశాడు. అప్పటికే స్టంపౌట్ ప్రమాదం పసిగట్టి మాక్స్‌వెల్ వెనక్కి వచ్చేందుకు ప్రయత్నించాడు. అప్పటికే బెయిల్స్ గాల్లోకి లేచాయి. దీంతో అంఫైర్లు అతడిని అవుట్‌గా ప్రకటించారు.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ధోని చేసిన ఈ స్టంపౌట్ అతని కెరీర్‌లోనే అత్యుత్తమ స్టంపౌట్ అని కామెంటేటర్లు అభిప్రాయపడ్డారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 252 పరుగులు చేసి ఆలౌటైంది. 253 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 43.1 ఓవర్లలో 202 పరుగులు చేసి ఆలౌటైంది.