హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా రెండో వన్డే కోసం భారత్-ఆస్ట్రేలియా జట్లు ఇప్పటికే కోల్ కతాకు చేరుకున్నాయి. కోల్‌కతాలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాక్టీస్ రద్దు అయింది. దీంతో బుధవారం ఇరు జట్లు హోటల్‌కే పరిమితమయ్యాయి.
ఈ క్రమంలో ధోని బ్యాటుతో సాధన చేయడం మానేసి, గన్ను పట్టాడు. వర్షం వల్ల ప్రాక్టీస్ సెషన్ రద్దుకావడంతో మహీ నేరుగా కోల్‌కతా పోలీస్ ట్రెయినింగ్ స్కూల్‌కు వెళ్లిపోయాడు. అక్కడ పిస్టల్ షూటింగ్‌లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ధోని షూటింగ్‌లోనూ దిట్ట అని, కచ్చితమైన గురితో అదరగొట్టాడని కోల్‌కతా పోలీస్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.
షూటింగ్ రేంజ్‌లో పిస్టల్‌తో గురిపెట్టి కాల్చడమే కాకుండా కొత్తగా ఈ ఉద్యోగంలో చేరివ వారితో ముచ్చటించాడని కోల్‌కతా పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ధోని మాటలు వారిలో ఎంతో స్ఫూర్తిని నింపాయని ఆయన తెలిపారు. ధోనీ 10, 25 మీటర్ల రేంజ్‌లో కచ్చితమైన గురితో పిల్లెట్స్ పేల్చాడని తెలిపారు.
2010లో కూడా లాల్‌బజార్ షూటింగ్ రేంజ్ సందర్శనకు వచ్చిన ధోని, అక్కడ ఉన్న ఓ పాతకాలపు మోటార్ సైకిల్‌ను చూసి ముచ్చటపడ్డాడు. ఇదిలా ఉంటే ఇరు జట్ల మధ్య గురువారం మధ్యాహ్నాం 1.30 గంటలకు రెండో వన్డే కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది.