
హైదరాబాద్: ఐపీఎల్ 2018 ట్రోఫీ విజయం అనంతరం చెన్నై కెప్టెన్ ధోనీ.. రాంచిలోని ఓ విలాసవంతమైన స్వగృహంలో తన కుటుంబంతో విశ్రాంతి తీసుకున్నాడు. సువిశాలమైన ఇంటి ఆవరణలో తనకు ఇష్టమైన బైకులు, కార్లు పదుల సంఖ్యలో ఉంటాయి. అలాగే పెంపుడు కుక్కలన్నా అంటే మహీకి మరీ ఇష్టం. చాలాసార్లు ధోనీ తన నివాసంలో పెంచుకుంటున్న కుక్కలతో ఉన్న ఫొటోలను సామాజిక మాద్యమాల ద్వారా పంచుకున్నాడు.
స్టేడియంలో భద్రత కోసం పోలీసుల వెంట వచ్చే శునకాలను ప్రేమగా నిమురుతూ వాటిని మచ్చిక చేయడాన్ని చాలాసార్లు చూశాం. తాజాగా మార్నింగ్ వాక్‌కు వెళ్లేముందు శునకాలతో బయలుదేరాడు. ధోనీ వస్తుండగా అతని ముందు శునకాలు ఎంతో సంబరంగా ఆటలాడుకుంటూ.. పరుగెత్తసాగాయి. తాజాగా వాటికి సంబంధించిన వీడియోను ధోనీ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు, షేర్ చేయడంతో అదికాస్త వైరల్‌గా మారింది.
ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతుండగా తన టీమ్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి కూడా భద్రతా సిబ్బంది దగ్గరున్న కుక్కను తీసుకెళ్లాడు. మ్యాచ్‌లో ఓడినా, గెలిచినా కూడా తన ఇంట్లో ఉన్న కుక్కలు తనను ఒకేలాగా చూస్తాయని గతంలో ధోనీ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
'శునకాల గుంపుతో కలిసి ఉదయపు నడక. శామ్ (పెంపుడు శునకం పేరు) స్వేచ్ఛగా మిగిలిన వాటిని ఇబ్బంది పెట్టేస్తోంది. బహుశా దానికి తెలుసునేమో.. తనే నా ఫేవరెట్ అని' సరదాగా ధోని వెల్లడించాడు. అఫ్ఘనిస్థాన్‌తో జూన్ 14 నుంచి భారత్ జట్టు ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుండగా.. ఇప్పటికే సుదీర్ఘ ఫార్మాట్ నుంచి వైదొలిగిన ధోనీ.. జూన్ 27, 29న ఐర్లాండ్‌తో జరగనున్న టీ20లకి మళ్లీ టీమిండియాతో కలవనున్నాడు.