హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్లో క్రికెటర్లు ప్రత్యర్థి ఆటగాళ్లకి మైదానంలో చిరు సాయం చేస్తూ క్రీడాస్ఫూర్తిని చాటుకుంటున్నారు. గుజరాత్ బౌలర్ థంపీ షూ జారిపోతే.. రన్ కోసం వెళుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఆగి.. షూ తీసుకుని బౌలర్ చేతిలో పెట్టిన వీడియోని మనం చూశాం.
ఆ తర్వాత ఢిల్లీ యువ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ షూ లేస్ జారిపోతే.. టీమిండియా వెటరన్ ఆటగాడు యువరాజ్ సింగ్ ఏ మాత్రం భేషజం లేకుండా పంత్కి షూ లేస్ కట్టి సాయం చేశాడు. తాజాగా అలాంటి సాయమే సన్రైజర్స్ జట్టుకు ఆడుతున్న అఫ్గానిస్థాన్ స్పిన్నర్ మహ్మద్ నబీ చేసి అందరి మనసులు గెలిచాడు.
వివరాల్లోకి వెళితే ఉప్పల్ వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో ముంబై ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా షూ లేస్ ఊడిపోయింది. సాయం కోసం ఆ ఓవర్ బౌలింగ్ చేసి వెళ్తున్న నబీని కోరగా.. అతను చిరునవ్వు నవ్వుతూ షూ లేస్ పూర్తిగా విప్పి.. మళ్లీ జాగ్రత్తగా కట్టాడు.
సాధారణంగా బ్యాట్స్మెన్ ఒక్కసారి ప్యాడ్స్ కట్టుకుంటే.. మళ్లీ వాటిని విప్పేవరకు కిందకి వంగలేడు. దీంతో షూకి సంబంధించిన సమస్య ఏదైనా వస్తే అతను ఎవరో ఒకరి సాయం తీసుకోవాల్సిందే. గతంలో సహచర బ్యాట్స్మెన్ సాయం తీసుకునేవారు. ప్రస్తుతం క్రికెటర్లు ప్రత్యర్ధుల సాయాన్ని కోరుతున్నారు.