డెర్బీ: కంగారులపై హర్మన్ కౌర్ సాధించిన సెంచరీ భారత మహిళా క్రికెట్‌లో కొత్త జోష్‌ను నింపింది. పురుషులకు ఏమాత్రం తీసిపోని రీతిలో కౌర్ ఆడిన షాట్స్ చూస్తుంటే.. క్రికెట్‌ను ఇక 'జెంటిల్ మెన్' గేమ్ అన్న నీడ నుంచి వేరుగా చూడాల్సిందే.
మైదానంలో బౌలర్లపై కౌర్ విరుచుకుపడుతున్న వేళ.. ఇటు భారత అభిమానులతో పాటు అటు కెప్టెన్ మిథాలీ అండ్ కో సైతం చిన్నపాటి స్టెప్పులతో సంబరాలు చేసుకున్నారు. సహచర క్రికెటర్ వేద కృష్ణమూర్తితో కలిసి కెప్టెన్ మిథాలీ వేసిన స్టెప్స్ ప్రస్తుతం ట్విట్టర్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. కౌర్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత వీరిద్దరు కలిసి వేసిన స్టెప్స్ కెమెరాకి చిక్కాయి.
అయితే తమ స్టెప్స్ కెమెరాలో రికార్డవుతున్నట్లు గమనించగానే.. ముసిముసిగా నవ్వుతూ వీరిద్దరూ డ్యాన్స్ ఆపేశారు. గురువారం భారత్-ఆసీస్ మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ సమయంలో ఈ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. వరల్డ్ కప్ నిర్వాహకులు ఈ వీడియోను ట్విటర్ ద్వారా అభిమానులకు షేర్ చేశారు.