హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మూడో వన్డే జరగనుంది. ఇప్పటికే ఈ సిరిస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే మూడో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బౌలర్ అవతారం ఎత్తనున్నాడా? అంటే అవుననే అంటున్నారు.
మూడో వన్డేకి ముందు టీమిండియా హోల్కర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేసింది. ఈ ప్రాక్టీస్ సెషన్‌ను చూసిన ఎవరికైనా ఇదే అనుమానం రాకమానదు. ఈ సిరిస్‌లో రాణిస్తున్న కుల్దీప్ యాదవ్, చాహల్, అక్షర్ పటేల్‌తో కలిసి ధోని నెట్స్‌లో స్పిన్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. తన సహజశైలికి భిన్నంగా ఈ సారి స్పిన్ బౌలింగ్ వేశాడు.
కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలింగ్ చేసే ధోనీ ఈ సారి తన స్టైల్ మార్చి బౌలింగ్ చేశాడు. బ్యాట్స్‌మన్‌కు ఆఫ్ స్పిన్, లెగ్‌స్పిన్ బంతులు విసురుతున్న వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌లో పోస్టు చేసింది. 'భారత స్పిన్ ఎటాక్‌లోకి ఎవరొచ్చారో చూడండి' అంటూ కామెంట్ పెట్టింది. ఇదిలా ఉంటే గతంలో వన్డేల్లో ఆరు ఓవర్లు వేసిన ధోని ఒక వికెట్ తీసుకున్న సంగతి తెలిసిందే.
ధోనీ బౌలింగ్ చేయడం చాలా అరుదు. 2011లో లార్డ్స్ టెస్టులో బౌలింగ్ చేసిన దోని.. దాదాపు పీటర్సన్‌ను అవుట్ చేసినంత పని చేశాడు. తొలుత అంపైర్ అవుటిచ్చినప్పటికీ.. బ్యాట్స్‌మెన్ రివ్యూ కోరి బతికిపోయాడు.
ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగా.. తనపై నోరు పారేసుకున్న పీటర్సన్‌కు నేను దాదాపుగా అవుట్ చేశా.. ఆ విషయం మర్చిపోకంటూ ధోనీ బదులిచ్చిన సంగతి తెలిసిందే.